తెలంగాణాలో బిజెపికి 35 శాతం ఓట్లు, 10 సీట్లు రావాల్సిందే

లోక్‌సభ ఎన్నికల్లో బిజెపికి 350 నుండి 400 సీట్లు వస్తాయని  కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో గురువారం కొంగరకలాన్‌లో నిర్వహించి బిజెపి లోక్‌సభ ఎన్నికల సన్నాహాల విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణాలో సహితం రెండంకెల సీట్లు (కనీసం 10 సీట్లు) వచ్చే విధంగా కృషి చేయాలనీ దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 35 శాతానికి పైగా ఓట్లు సాధించి తెలంగాణ నుంచి 10 సీట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు
 
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణాలో కనీసం 30 సీట్లు రాగలవని అనుకున్నామని, కానీ రెండంకెలకన్నా తక్కువగా 8 సీట్లు మాత్రమే రావడం పట్ల కీలక నేతలతో జరిగిన భేటీలో ఆయన ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేసిన్నట్లు తెలిసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా వచ్చిందని, దానికి వేవ్ లేదని స్పష్టం చేశారు.
 
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే సీటు మాత్రమే సాధించిందని, అయితే తాజా ఎన్నికల్లో 8 సీట్లతో మెరుగైన ఫలితాలు సాధించామని చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కచ్ఛితంగా 64 సీట్లు నుంచి 95 సీట్లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
 
‘తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాల్లోనూ పోటీ పడదాం. 2018లో మనకు ఒక ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పుడు 6 శాతం ఓట్లు సాధిస్తే ఇప్పుడు 14 శాతం సాధించాం. 2019లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకుని 20 శాతం ఓటు బ్యాంకు సాధించాం. ఈ లెక్కన ఇప్పుడు 35 శాతం ఓట్లు సాధించి 10 మంది ఎంపీలు ఉండాలి’ అని అమిత్ షా స్పష్టం చేశారు. ఇందుకోసం కలిసికట్టుగా పనిచేద్దామని ఆయన పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ మునిగిపోయిన నావ, కాంగ్రెస్‌ మునిగిపోయే నావ అని చెప్పారు. తెలంగాణలో వికసించేది కమలమేనని అని పేర్కొంటూ కాంగ్రెస్‌ పార్టీది అసలైన విజయం కాదని, కేసీఆర్‌ ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకత కాంగ్రె్‌సకు లాభించిందని వ్యాఖ్యానించారు.

 ‘కేసీఆర్‌ కుటుంబ పాలనతో, కేటీఆర్‌, కవిత, హరీశ్‌రావుల వైఖరితో తెలంగాణ ప్రజలు విసుగెత్తారు. కేసీఆర్‌ కుటుంబం తెలంగాణ సంపదను దోచుకుంది. అంతేకాదు ముస్లిం ఓట్ల కోసం కేసీఆర్‌ సంతుష్టీకరణ విధానాలు అవలంబించారు. అందుకే ఆయన్ను రాష్ట్ర ప్రజలు ఫాంహౌ్‌సకు పంపించారు’ అని తెలిపారు. 

ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిందని, అది కూడా కుటుంబ పార్టీనే అని స్పష్టం చేశారు. ముస్లిం సంతుష్టీకరణ విధానంలో కేసీఆర్‌ కంటే కాంగ్రెసే ఒక అడుగు ముందుంటుందని అమిత్‌ షా విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం గత పదేళ్లలో కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిందని, అందులోనూ కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 

కుటుంబ పాలన, అవినీతి, ముస్లిం సంతుష్టీకరణకు వ్యతిరేకంగా పోరాడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా స్పష్టం చేశారు. బీసీలకు అండగా ఉన్నది బీజేపీ మాత్రమేనంటూ తెలంగాణలో బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు. మాదిగలకు న్యాయం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బీజేపీ హామీ ఇస్తే అమలు చేసి చూపిస్తుందని చెబుతూ దేశ ప్రజలు ప్రధాని మోదీవైపే ఉన్నారని, ఆయనను మరోసారి ప్రధానిగా కోరుకుంటున్నారని తెలిపారు.

 అందుకోసం ప్రతిఒక్కరూ కష్టపడి పని చేయాలని కార్యకర్తల్ని అభ్యర్థించారు. పార్లమెంట్ ఎన్నికలు ఒక వ్యక్తికి చెందినవి కావని పేర్కొంటూ దేశానికి, దేశ భవిష్యత్తుకు సంబంధించినవని చెప్పుకొచ్చారు.  పార్టీ స్థితిగతులపై నిర్వహించే సర్వే ఆధారంగా సిట్టింగ్ ఎంపీలు, గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయిస్తామని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను గుర్తించి, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని నాయకులను కోరారు.  త్వరలోనే అభ్యర్థులను ఖరారు చేస్తామని నేతలతో చెప్పినట్లు సమాచారం. కీలక నేతలతో మాత్రమే జరిగిన ఈ భేటీలో  వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్ర, రామ మందిర ప్రాణ ప్రతిష్ట వంటి పలు అంశాలపై చర్చించారని తెలిసింది.