వారం రోజుల పాటు రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకలు

జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి ముహూర్తం ఇప్పటికే ఖరారైంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే రామ్‌లల్లా ప్రతిష్ఠాపన కార్యక్రమం వారం ముందుగానే ప్రారంభం కానుంది.  జనవరి 16 నుంచి మొదలుపెట్టి వరుసగా ఏడు రోజుల పాటు వివిధ పూజా క్రతువులు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
16న ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ చేపట్టనుంది. దీనిలో భాగంగా సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణు ఆరాధన, గోపూజలు చేస్తారు. ఆ తర్వాత గర్భాలయంలో ప్రతిష్ఠించనున్న రాముడి విగ్రహంతో కూడిన ఊరేగింపు 17న అయోధ్యకు చేరుకుంటుంది. సరయూ నదీ జలాలను మంగళ కలశాలలో నింపుకొని భక్తులు రామజన్మభూమి ఆలయానికి తరలి వస్తారు.
18న గణేశ్‌ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, బ్రాహ్మణ వరణ్‌, వాస్తు పూజలతో ప్రతిష్ఠ కార్యక్రమాలకు లాంఛనప్రాయంగా అంకురార్పణ జరుగుతుంది.  19న పవిత్ర అగ్నిని వెలిగించి, నవగ్రహ స్థాపన, హోమాలు నిర్వహిస్తారు. 20న రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నదీ జలాలతో కడిగి, ఆ తర్వాత వాస్తు శాంతి హోమాలు, అన్నాధివాసం కార్యక్రమాలు ఉంటాయి.
21న రామ్‌లల్లా విగ్రహాన్ని 125 కలశాలల్లో స్నానం చేయిస్తారు. చివరగా 22న ఉదయం శాస్త్రోక్త పూజల అనంతరం మధ్యాహ్నం మృగశిర నక్షత్రంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా రామయ్యకు ప్రత్యేక కానుకులు అందనున్నాయి. చాంద్‌ఖురి (ఛత్తీ్‌సగఢ్‌)లో తన తల్లి తరఫున మూడు వేల క్వింటాళ్ల బియ్యం, నేపాల్‌లోని జనకపుర్‌లో అత్తింటి వారి నుంచి వివిధ రకాల ఆభరణాలు, పట్టు వస్త్రాలు, పండ్లు, మిఠాయిలతో పాటు 1,100 ప్లేట్లు సమర్పించనున్నారని ఆలయ వర్గాలు గురువారం తెలిపాయి. 

చాంద్‌ఖురి రాముడి తల్లి కౌసల్య పుట్టినిల్లుగా పరిగణిస్తుండగా, జనకపుర్‌ సీతమ్మ జన్మస్థలంగా భావిస్తారు. ఇక రామ జన్మభూమి ఆలయంలో హారతి పాస్‌ల బుకింగ్‌ గురువారం ప్రారంభమైంది. గర్భాలయంలో కొలువయ్యే రాముడికి రోజుకు మూడుసార్లు (ఉదయం 6.30, మధ్యాహ్నం 12.00, సాయంత్రం 7.30గంటలకు) హారతి ఇస్తామని తెలిపారు. 

హారతి కోసం భక్తులకు పాస్‌లు ఇచ్చే ప్రక్రి య ప్రారంభమైందని హారతి పాస్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌ ధ్రువేశ్‌ మిశ్రా తెలిపారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే ఈ కార్యక్రమానికి అనుమతిస్తామని స్పష్టం చేశారు. రామాలయ సముదాయం 70 ఎకరాలు ఉండగా, అందులో 70 శాతం పచ్చదనం ఉన్నట్టు ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ తెలిపారు. 

ప్రస్తుతం ఉన్న 600 చెట్లను సంరక్షిస్తున్నట్టు వివరించారు. ఆలయ సముదాయాన్ని 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పు, 161 అడుగుల ఎత్తుతో సంప్రదాయ నగర శైలిలో నిర్మించినట్టు వెల్లడించారు. ఆలయంలో ప్రతి అంతస్తు 20 అడుగుల ఎత్తు ఉంటుందని, మొత్తం 392 పిల్లర్లు, 44 గేట్లు ఉన్నట్టు వివరించారు.

అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి అన్ని ప్రవేశ ద్వారాల వద్ద బూమ్‌ బ్యారియర్స్‌, టైర్‌ కిల్లర్స్‌, బొల్లార్డ్‌లు, సీసీటీవీ కెమెరాలతో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వీఐపీలు, పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే ఈ కార్యక్రమంలో చొరబాట్లను నిరోధించే లక్ష్యంతో భద్ర తా పరికరాలను ఏర్పాటు చేసినట్టు యూపీ గవర్నమెంట్‌ కన్‌స్ట్రక్షన్‌ జనరల్‌ మేనేజర్‌ సీకే శ్రీవాస్తవ తెలిపారు. 

ఆలయం వైపు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని, అనుమతిలేకుండా వచ్చే వాహనాలను బూమ్‌ బ్యారియర్లు అడ్డుకుంటాయని చెప్పారు. అదేసమయంలో బొల్లార్డ్‌లతోపాటు భూమి లోపలి నుంచి టైర్‌ కిల్లర్స్‌ పైకి వచ్చి వాహనం కదలకుండా నిరోధిస్తాయని తెలిపారు.రామమందిరంలో అన్ని ప్రవేశ ద్వారాల వద్ద ఈ తరహా పరికరాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.