రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠపై `ఇండియా’ కూటమి సందిగ్ధత

మొత్తం ప్రపంచం దృష్టిని ఆకట్టుకునే విధంగా అయోధ్యలో అత్యంత వైభవంగా రామమందిరం ప్రాణ ప్రతిష్టాపనకు జరుగుతున్న సన్నాహాలు దేశ వ్యాప్తంగా ప్రజలలో పండుగ వాతావరణం నెలకొల్పుతున్నాయి. ఇటువంటి ప్రతిష్టాకరమైన ఉత్సవాలలో పాల్గొనే విషయమై `ఇండియా’ కూటమి పక్షాలు సందిగ్ధతలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి.
 
వామపక్షాలతో సహా అన్ని పక్షాల నాయకులకు ఈ కార్యక్రమానికి ఆహ్వానాలు అందాయి. ఒక వంక ఈ కార్యక్రమంపై హాజరు కానిపక్షంలో తాము `హిందూ వ్యతిరేకులం’గా ముద్రపడాల్సి వస్తుందనే ఆందోళన వారిలో కలుగుతున్నది. హాజరైతే మరోవంక బిజెపి పన్నాగంలో చిక్కుకున్నట్లు కాగలదని భయం వెంటాడుతున్నది.
 
వచ్చే ఏడాది జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరుగనున్నది. మరో వైపు శ్రీరామజన్మభూమి తీర్థకేత్ర ట్రస్ట్‌ వేడుకకు హాజరుకావాలని ప్రముఖులకు ఆహ్వానాలను పంపుతున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశంలోని పలువురు రాజకీయ నేతలకు ఆహ్వానాలు అందాయి. ప్రధాని నరేంద్ర మోదీ సహా 6 వేల మంది అతిథులు ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇప్పటికే సీతారాం ఏచూరి వంటి కొందరు నేతలు ఈ కార్యక్రమంపై హాజరుకాబోమని ప్రకటించినా కీలక నేతలు మౌనం వహిస్తున్నారు. రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్‌ తీసుకొనే నిర్ణయం 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందా? అని మీడియా ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ చేసిన వ్యాఖ్యలు ఈ సందిగ్ధతను స్పష్టం చేశాయి.

‘మీరు వెళితే మీరు బీజేపీ చెప్పినట్టు వ్యవహరిస్తున్నారని అర్థం. మీరు వెళ్లకపోతే మీరు హిందు వ్యతిరేకులు. ఇది అర్థం లేనిది. వ్యక్తులను ఆహ్వానించారు. వ్యక్తిగతంగానే నిర్ణయం తీసుకోనివ్వండి. నేను గుడిని రాజకీయ వేదిక అనుకోను. రాజకీయ కార్యక్రమానికి వెళ్లకపోవడం మిమ్మల్ని హిందూ వ్యతిరేకిని చేయదు’ అని ఆయన చెప్పడం కాంగ్రెస్ పార్టీలోని గందరగోళాన్ని వెల్లడి చేస్తుంది. 

ఈ అంశంపై ఉమ్మడిగా ఒక నిర్ణయం తీసుకోవడం కష్టమని కూటమిలోని పార్టీలు భావిస్తున్నాయి. అయితే రామ మందిరం ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న బీజేపీకి విపక్షాల నిర్ణయం వల్ల కొంత ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నది. మత విశ్వాసాలను రాజకీయికరణ చేశారణ విమర్శిస్తూ ప్రాణ ప్రతిష్ఠకు హాజరు కాలేనని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.

తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా ఇదే తరహా అభిప్రాయంతో ఉన్నా తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ‘ఇవన్నీ రాజకీయాలు. బీజేపీ నిర్వహించే కార్యక్రమానికి హాజరవ్వాలని ఎవరు కోరుకుంటారు? ఇదేమీ జాతీయ కార్యక్రమం కాదు. బీజేపీ కార్యక్రమం అయ్యాక మేము అయోధ్యను సందర్శిస్తాం’ అని శివసేన(యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోయినా ఎన్నికల పరంగా ఎక్కువ నష్టం కలగకుండా ఉండేలా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరు కాకపోతే ఉత్తరాదిలో ఓట్లు రావేమోనని కాంగ్రెస్‌ ఆందోళన చెందుతున్నదని కేరళ జెమ్‌-ఇయ్యాతుల్‌ ఉలమా(సంస్థ) విమర్శించింది.

రాముడి ప్రాణ ప్ర‌తిష్ట కోసం సోనియా గాంధీ లేదా కాంగ్రెస్ బృందం వెళ్లే ఛాన్సు ఉన్న‌ట్లు ఇటీవ‌ల ఆ పార్టీకి చెందిన సీనియ‌ర్ నేత దిగ్విజ‌య్ సింగ్ ప్రకటించారు. కానీ సోనియా గాంధీ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఈ అంశంపై అధికారికంగా ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. ఈ అంశంలో ఆమె సానుకూలంగా ఉన్న‌ట్లు దిగ్విజ‌య్ చెప్పారు. పార్టీ వైఖ‌రి ఏంట‌న్న అంశం త్వ‌ర‌లోనే తెలుస్తుంద‌ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు.

అయితే మందిరం ప్రారంభోత్సవానికి హాజరవ్వాలా? వద్దా? అని నిర్ణయం తీసుకోవడం పార్టీలకు కానీ, వ్యక్తులకు కానీ అంత సులభం కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రామ మందిరం రాజకీయ ఉద్యమంతో ముడిపడిన అంశం. దీనిపై పార్టీలు లేదా నాయకులు తీసుకొనే నిర్ణయాలను ఎన్నికల పరిణామాలతో కూడిన రాజకీయాల కోణంలో చూసే ప్రమాదం ఉందని చెప్తున్నారు.

అయితే, రామమందిర ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం అందలేదని ఎన్‌సీపీ అధ్యక్షుడు  శరద్‌ పవార్‌ తెలిపారు. రామ మందిరాన్ని బీజేపీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకొంటోందో లేదో చెప్పడం కష్టమని వ్యాఖ్యానించారు. కాగా, రామ మందిర ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం అంద‌లేద‌ని, ఒక‌వేళ ఆహ్వానం వ‌స్తే అప్పుడు క‌చ్చితంగా వెళ్ల‌నున్న‌ట్లు `ఇండియా’ కూటమిలో భాగస్వామి అయినా ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తెలిపారు