ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టిన విజయ భారతి

జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలిగా హైదరాబాద్ కు చెందిన న్యాయవాది సాయని విజయ భారతి గురువారం బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదిగా, సామాజిక కార్యకర్తగా తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న విజయభారతిని ఎన్.హెచ్.ఆర్.సీ సభ్యురాలిగా నియమిస్తూ బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. 
 
గురువారం ఢిల్లీలోని ఎన్.హెచ్.ఆర్.సీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ అరుణ్ కుమార్ మిశ్రా సమక్షంలో  విజయభారతి బాధ్యతలు స్వీకరించారు. తనపై విశ్వాసంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాష్ట్రపతికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తనపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా విజయభారతి పేర్కొన్నారు.
 
ఆమె పలు సామజిక కార్యక్రమాలలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. పలు జాతీయవాద సంస్థలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆమె తెలంగాణ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సివిల్, క్రిమినల్ విషయాలను నిర్వహించడంతో పాటు, ఆమె మహిళల వేధింపులు, వరకట్న కేసులలో, సమాజంలోని ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి న్యాయ సహాయం అందించడంలో విస్తృతంగా ప్రసిద్ది చెందారు.

 
ఆమె అంజనీ మాత సేవా ట్రస్ట్, సంవర్ధినీ న్యాస్, ప్రజ్ఞా భారతి వంటి అనేక వృత్తిపరమైన, సామాజిక సంస్థలకు వివిధ హోదాల్లో సేవలందించారు, మహిళల సమగ్ర, బహుముఖ సాధికారతపై దృష్టి సారించే సామజిక సంస్థలతో కలిసి కృషి చేశారు. వివిధ సమస్యలు, హక్కులపై అవగాహన కల్పించేందుకు వివిధ కళాశాలల్లో విద్యార్థినులకు 100కు పైగా వర్క్‌షాప్‌లు నిర్వహించారు.  మహిళా సంక్షేమ రంగంలో ఆమె చేసిన కృషికి వివిధ సంస్థల నుంచి పలు అవార్డులను పొందారు. వివిధ తెలుగు వారపత్రికలలో స్త్రీల సమస్యలకు సంబంధించి 200కి పైగా వ్యాసాలు రాశారు.