క్రిస్మస్ వేళ మూగబోయిన ఏసు క్రీస్తు జన్మస్థలం

క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది. యుద్దం కారణంగా బెత్లెహం నగరానికి పర్యాటకులు ఎవరూ రాలేదు. 
 
సాధారణంగా క్రిస్మస్ పర్వదినం వేళ బెత్లెహం నగరంలో సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కానీ ఈ సారి పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. యుద్ధం కారణంగా ఏసు క్రీస్తు భక్తులు, పర్యాటకులు ఎవరూ కూడా బెత్లెహంకు వెళ్లలేదు. దీంతో ప్రతి ఏడాది డిసెంబర్ నెలలో కలకళలాడే స్థానిక హోటల్స్, మాల్స్, రెస్టారెంట్లు వెలవెలబోయాయి. 
 
ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంకులోని పాలస్తీనాలోనే బెత్లెహం నగరం ఉంది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రభావం ఈ ప్రాంతంపై భారీగా పడింది.
బెత్లెహంలో క్రిస్మస్ వేడుకలు జరగకపోవడంతో స్థానికులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పర్యాటక రంగం పైనే ఆధారపడి జీవిస్తుంటారు. 
 
ఇక్కడి చర్చ్​లను, చారిత్రక కట్టడాలను చూసేందుకు విదేశీయులు వస్తేనే వీరి వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ సారి యుద్ధం కారణంగా పర్యాటకులు ఎవరూ రాకపోవడంతో వారి జీవనోపాధి దెబ్బతింది. “ఈసారి మాకు అతిథులు లేరు. ఒక్కరు కూడా రాలేదు” అని అలెగ్జాండర్ అనే​ హోటల్ యజమాని తెలిపారు.
​’మా పూర్వికుల నుంచి అందరం ఇక్కడే ఉంటున్నాము. నేను చూసిన అతి ఘోరమైన క్రిస్మస్ ఇదే. ఈ సారి క్రిస్మస్​చెట్టు లేదు. సంతోషం లేదు’ అని మరొకరు పేర్కొన్నారు. 
 
“అక్టోబర్​7కి ముందు పరిస్థితులు అన్ని బాగానే ఉండేవి. క్రిస్మస్​బుకింగ్స్‌తో అప్పటికే హెటల్ గదులన్నీ నిండిపోయాయి. ఇంకా డిమాండ్​ ఉండటంతో తాత్కాలిక ఏర్పాట్లు చేయాలేమో అని కూడా భావించాను. కానీ యుద్ధం కారణంగా బుకింగ్స్‌ని రద్దు చేసుకున్నారు. వచ్చే ఏడాది బుకింగ్స్​ కూడా రద్దైపోయాయి” అని జో కనవాటీ అనే వ్యక్తి వివరించారు. 
 
కాగా అక్టోబర్​7న ఇజ్రాయెల్‌పై హమాస్​బృందం దాడి చేయడంతో మొదలైన ఉద్రిక్తత పరిస్థితులు ఇప్పటికీ కొనసాతున్నాయి. హమాస్‌ను అంతం చేసేందుకు గాజాపై ఇజ్రాయెల్ బీభత్సంగా దాడి చేస్తోంది.  ఈ నేపథ్యంలో యుద్ధ ప్రాంతాల్లో పర్యటనకు అక్కడి ప్రజలతో పాటు విదేశీయులు దూరంగా ఉంటున్నారు. ఈ యుద్ధం కారణంగా రెండు వైపుల భారీగా ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకుంది. వేలాది మంది చనిపోయారు. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి.
 

ఇలా ఉండగా, ప్రతీ ఏటా క్రిస్మస్‌ రోజున యావత్తు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చే పోప్‌ ఫ్రాన్సిన్‌ ఈసారి యుద్ధాలకు వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. గాజాపై ఇజ్రాయిల్‌ పాల్పడుతున్న కనికరం లేని దాడులను ‘పవిత్రభూమిలో పనికిమాలిన యుద్ధంగా’ విమర్శించారు. యుద్ధాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. వలస వచ్చిన ప్రజల హక్కులను సమర్థించారు. ప్రస్

 
తుతం ప్రపంచవ్యాప్తంగా ఉక్రెయిన్‌, సిరియా, యెమెన్‌, లెబనాన్‌, ఆర్మేనియా, అజర్‌బైజాన్‌ వంటి ప్రాంతాల్లో సాగుతున్న రాజకీయ, సామాజిక, సైనిక వివాదాలకు ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. గాజాతో సహా వివిధ యుద్ధాల్లో చనిపోతున్న చిన్నారులను ‘నేటి బాల యేసులు’గా పోప్‌ అభివర్ణించారు.
కాగా,  యుద్ధాలను ఆయుధ పరిశ్రమ నియంత్రిస్తుందని పేర్కొంటూ ‘ఆయుధాల ఉత్పత్తి, అమ్మకాలు, వాణిజ్యం వేగంగా పెరుగుతున్నప్పుడు మనం శాంతి గురించి ఎలా మాట్లాడగలం’ అని ప్రశ్నించారు.