181 ఎకరాల శంషాబాద్ భూములు హెచ్‌ఎండిఎవే

తప్పుడు భూ రికార్డులు సృష్టించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వారిపై తీరుపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణదారులు వేసి రిట్ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఆ భూములు హెచ్ఎండీఏకు చెందుతాయని కీలక తీర్పు ఇచ్చింది.  శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండీఏకు ఉన్న 181 ఎకరాల భూముల్లో దాదాపు 50 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు గత కొన్ని రోజులుగా కొందరు ప్రయత్నించారు.
సంబంధంలేని సర్వే నెంబర్లను చూపి హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్న భూములను ఆక్రమించేందుకు యత్నించారు. రాష్ట్ర ప్రభుత్వం, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ ఎస్టేట్, లీగల్, ఎన్ఫోర్స్ మెంట్ ఉన్నతాధికారులు భూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి.. న్యాయపరమైన అంశాలను పరిగణలోకి తీసుకొని ఏడాది కాలంగా హైకోర్టులో తమ వాదనలు వినిపిస్తున్నారు.
వాద ప్రతివాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం డివిజనల్ బెంచ్ నవంబర్ 18న తీర్పును రిజర్వ్ ఫర్ ఆర్డర్స్‌లో పెట్టింది.  కాగా,  తుది తీర్పును గురువారం వెల్లడిస్తూ ఆక్రమణదారుల రిట్ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు వెల్లడించింది. శంషాబాద్‌లోని 181 ఎకరాల భూములను 1990 సంవత్సరంలో ఆనాటి అవసరాల నిమిత్తం ట్రక్ టెర్మినల్ పార్క్ ఏర్పాటు కోసం ల్యాండ్ ఎక్వివైజేషన్ కింద హెచ్ఎండీఏ తీసుకుంది. దీంతో ఈ భూములపై హెచ్ఎండీఏకు సర్వ హక్కులు సంక్రమించాయి. 
 
అయితే ఇక్కడి భూముల్లోని దాదాపు 20 ఎకరాల్లో హెచ్ఎండీఏ నర్సరీ పనిచేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు హెచ్ఎండీఏకు సంబంధించిన 181 ఎకరాల్లో 2 ఎకరాల భూమిని ఆ పరిసరాల ప్రజల సౌకర్యార్థం వెజ్, నాన్ వెజ్ మార్కెట్‌కు కేటాయించింది.  ఇక, రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన నేపథ్యంలో శంషాబాద్ మున్సిపల్ ఆఫీసు నిర్మాణం కోసం హెచ్ఎండీఏకు సంబంధించిన ఈ భూముల నుంచి మరో 30 గుంటల భూమిని కూడా కేటాయించింది.