* క్రాస్ వోటింగ్ తో రాజ్యసభకు బిజెపి అభ్యర్థి ఎన్నిక
హిమాచల్‌ప్రదేశ్‌లో సుఖ్విందర్‌సింగ్ సుఖు నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు ఏ క్షణమైనా కుప్పకూలిపోవచ్చని ఆ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ జోస్యం చెప్పారు. ప్రస్తుతం సుఖు సర్కారు మైనారిటీలో ఉన్నదని, అధికార పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి తీరుపై అసంతృప్తిగా ఉన్నారని ఆయన చెప్పారు.
అయితే హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ డిమాండ్ చేయనుందా అని మీడియా ప్రశ్నించగా బుధవారం సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారని, బడ్జెట్‌పై చర్చలో పాల్గొంటామని, అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కానీ, ప్రభుత్వం మెజారిటీ కోల్పోయినట్లు తనకు అనిపిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక రాజ్యసభ స్థానానికి మంగళవారంనాడు ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్ గెలుపొందారు. కాంగ్రెస్ ప్రత్యర్థి అభిషేక్ మను సింఘ్విపై హర్ష్ మహాజన్ గెలుపొందారు. క్రాస్ ఓటింగ్ కాంగ్రెస్ పార్టీ కొంపముంచింది. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో మొత్తం 68 ఓట్లలో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఇరువురుకి చెరో 34 ఓట్లు వచ్చాయి. దీంతో ‘టాస్’ ఆధారంగా గెలుపును నిర్ణయించారు. ఈ ‘డ్రా’లో బీజేపీ అభ్యర్థి హర్ష్ మహాజన్‌ను గెలుపు వరించింది. అసెంబ్లీలోని మొత్తం 68 మంది సభ్యులకుగాను 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్‌సింగ్ బబ్లూ ఓటింగ్‌లో పాల్గొనలేదు.
రాజ్యసభ ఎన్నికల్లో హర్ష్ మహాజన్ గెలుపుపై బీజేపీ హర్షం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఉన్నప్పటికీ ఆ పార్టీ రాజ్యసభ సీటు గెలుచుకోలేకపోయిందని, హర్షవర్ధన్‌కు శుక్షాకాంక్షలని విపక్ష నేత జయరాం ఠాకూర్ తెలిపారు. కేవలం ఏడాదిలోనే సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎంను విడిచిపెట్టేశారని చెబుతూ ఇందుకు బాధ్యత వహించి సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
ప్రపంచ నాగరికత కోసం సనాతన ధర్మాన్ని గౌరవించాలి
అమెరికాలో భారత్ వ్యతిరేక సెనేటర్ తో రాహుల్ భేటీపై బిజెపి ఆగ్రహం
పాకిస్థాన్ తో చర్చలు జరిపే కాలం ముగిసింది