రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు

రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేసు నమోదవుతుందని ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రాన ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం అని స్పష్టం చేశారు. 

 ఏపీ, తెలంగాణలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయని చెబుతూ ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలని తేల్చి చెప్పారు. పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాకుండా ఎవ్వరు  ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలని ఆయన తెలిపారు.  ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని చెబుతూ రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారని వివరించారు.  

వచ్చే ఎన్నికల్లో సీనియర్‌ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందని చెప్పారు. తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. 

వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారని చెబుతూ ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం’ అని వివరించారు.

ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని, పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరిందని, ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయని వివరించారు.  గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించగా, అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించామని పేర్కొంటూ అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించామని వెల్లడించారు.