దట్టమైన పొగమంచుతో పలు విమానాలకు అంతరాయం

దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 9.4 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయి. దీంతో రాజధాని ప్రాంతాన్ని దట్టంగా పొగ కమ్మేసింది. దట్టమైన పొగ మంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 
 
భారత వాతావరణ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం రాజధానిలోని వివిధ ప్రాంతాల్లో విజిబిలిటీ 125 మీటర్లకు పడిపోయింది. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లోని వివిధ ఎయిర్‌ పోర్టుల్లో కూడా విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది.  ఢిల్లీలోని పాలెం విమానాశ్రయం, అమృత్‌సర్‌, ఆగ్రా, గ్వాలియర్‌, ప్రయాగ్‌రాజ్‌, జైసల్మేర్‌ విమానాశ్రయాల్లో విజిబిలిటీ 0 మీటర్లకు పడిపోయింది. 
 
ఢిల్లీ సఫ్దార్‌గంజ్‌లో 200 మీటర్లు, షిల్లాంగ్‌ విమానాశ్రయంలో 300 మీటర్లకు విజిబిలిటీ పడిపోయింది.  ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలకు తీవ్ర ప్రభావం పడింది. దట్టమైన పొగ మంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్నింటిని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
 
సోమవారం ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఢిల్లీ చేరాల్సిన ఆరు విమానాలను సైతం దారి మళ్లించినట్లు వెల్లడించారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన యుకె897 విమానం, ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన యుకె873 విమానం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తిరిగి బెంగళూరుకు దారి మళ్లించారు.
 
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత
 
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. గత రెండు రోజుల్లో ఏపీ, తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోయాయి. చాలా ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దట్టమైన పొగమంచు కమ్మేసింది. 
 
దీంతో హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను ఇతర ఎయిర్ పోర్టులకు దారిమళ్లిస్తున్నారు. మూడు విమానాలు గన్నవరం ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యాయి. ఛత్తీస్‌గడ్‌, తిరువనంతపురం, గోవా నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా గన్నవరం ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. వాతావరణం అనుకూలించిన తర్వాత వారిని తిరిగి గమ్యస్థానాలకు తరలించనున్నారు.
 
సోమవారం ఉదయం గం.07:35 లకు మస్కట్ నుంచి శంషాబాద్ రావాల్సిన ఒమాన్ ఎయిర్‌లైన్స్‌ విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు దారి మళ్లించారు. రియాద్ నుంచి హైదరాబాద్ కు రావాల్సిన విమానం, జెడ్డా నుంచి రావాల్సిన విమానాలను పొగమంచు కారణంగా బెంగళూరుకు దారి మళ్లించారు. పలు విమానాలను బెంగళూరు, నాగపూర్‌, గన్నవరం విమానాశ్రయానికి దారి మళ్లించినట్లు శంషాబాద్ అధికారులు తెలిపారు.

పొగమంచు కారణంగా ఢీకొన్న 10 వాహనాలు

పొగమంచు కారణంగా, హపూర్‌- బులంద్‌షహర్‌ హైవేపై పొగమంచు కారణంగా సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీకి  సుమారు 86 కిలోమీటర్ల దూరంలో ఉన్న హపూర్‌-బులంద్‌షహర్‌ హైవేపై సుమారు 10 వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో పలు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 
 
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ప్రమాదం నేపథ్యంలో హైవేపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. దీంతో దెబ్బతిన్న కార్లను క్రేన్‌ సాయంతో పోలీసులు అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించే చర్యలు చేపట్టారు.