4 వేల మార్క్‌ను దాటిన కరోనా యాక్టివ్‌ కేసులు

మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్‌ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్‌ బయటపడి మరింత కలవరపెడుతోంది. ఇటీవలే కొవిడ్‌ సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 గుర్తించిన విషయం తెలిసిందే.
 
ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్‌ చాప‌కింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు ఆ వేరియంట్ కేసులు పెరిగిపోతున్నాయి. డిసెంబర్‌ 24 వరకూ దేశవ్యాప్తంగా 63 ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ అయిన జేఎన్‌.1 కేసులు నమోదైనట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. వీటిల్లో గోవాలోనే అత్యధికంగా 34 కేసులు నమోదైనట్లు తెలిపాయి. మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడులో 4, తెలంగాణలో 2 జేఎన్‌.1 కేసులు బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
 
కాగా, తాజాగా దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 4 వేల మార్క్‌ను దాటింది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 312 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,742 నుంచి 4,054కు పెరిగింది.

ఇక తాజా కేసుల్లో అత్యధికంగా కేరళలో 128 కేసులు వెలుగుచూశాయి. నిన్న ఒక్క రోజే ఒక మరణం నమోదైంది. దీంతో మొత్తం కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,33కి చేరింది. ఇక 24 గంటల్లో 315 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,71,860) చేరుకుంది.

మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 0.01 శాతం మాత్రమేనని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అదేవిధంగా రికవరీ రేటు 98.81 శాతం, మరణాలు 1.18 శాతంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో తాజాగా 5 కరోనా కొత్త వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు నమోదయ్యాయి. నవంబర్‌ 30 నుంచి 20 నమూనాలను పరీక్షించగా థానే నగరంలో ఐదు జేఎన్.1 వేరియంట్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.  ప్రస్తుతం నగరంలో క్రియాశీల కేసుల సంఖ్య 28కి పెరిగింది. వారిలో ఇద్దరు ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు వారి ఇళ్లలో కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో క‌రోనా కేసులు మ‌ళ్లీ పెర‌గ‌డానికి కొత్త వేరియంట్ జేఎన్‌.1 కార‌ణ‌మ‌ని తెలుస్తోంది.

మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా

మహారాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా సోకింది. పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఆయన కార్యాలయం తెలిపింది. అయితే వేరియంట్ వివరాలు వెల్లడించలేదు. నాగ్‌పూర్‌లో జరిగిన అసెంబ్లీ శీతాకాల సమావేశాల చివరి రోజైన డిసెంబర్ 20న మంత్రి ధనంజయ్ ముండే కరోనా బారినపడినట్లు ఆయన కార్యాలయం తెలిపింది. 
 
దీంతో తన ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నారని, వైద్యుల సూచనలు పాటిస్తున్నారని పేర్కొంది. ముండేకు ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని, వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తన శాఖ వ్యవహారాలు చూస్తున్నారని వెల్లడించింది.