వంట నూనెలపై దిగుమతి సుంకం రాయితీలు పొడిగింపు!

రిఫైన్డ్‌ సోయాబీన్‌ ఆయిల్‌, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దిగుమతులపై గతంలో తగ్గించిన సుంకానికి సంబంధించి కేంద్రం గడువును పొడించింది. గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం వచ్చే మార్చి నాటికి ముగియాల్సి ఉంది. ఈ క్రమంలో ధరల కట్టడి చేసేందుకు తగ్గించిన దిగుమతి సుంకం గడువును 2025 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. 

వంట నూనెలతో  పాటు, పప్పుపై దిగుమతి సుంకం మినహాయింపు సంబంధించి గడువును 2025 మార్చి 31 వరకు పొడిగించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాగా, గతంలో రిఫైన్డ్‌ సోయాబీన్‌, రిఫైన్డ్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని కేంద్రం 17.5శాతం నుంచి 12.5శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

దాంతో దేశీయంగా నూనెల ధరలు తగ్గి ప్రజలకు ధరల పెరుగుదల నుంచి ఊరట కలుగనున్నది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్‌లో 8.70శాతానికి పెరిగింది. అంతకు ముందు నెలలో 6.61 శాతంగా ఉన్నది. ఆహార ద్రవ్యోల్బణం పెరుగుదతో పేద, మధ్య తరగతి కుటుంబాలపై భారం పెరుగుతున్నది. 

ఈ క్రమంలో వచ్చే ఏడాది జరుగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో కేంద్రానికి సైతం ఆందోళన కలిగిస్తున్నది. భారత్‌ వంటనూనెల దిగుమతిలో రెండోస్థానంలో ఉన్నది. భారత్‌ తన అవసరాల కోసం 60శాతం నూనెలను దిగుమతి చేసుకుంటుంది. ఇందులో అధిక భాగంగా పామాయిల్‌, ఇండోనేషియా, మలేషియా నుంచి దిగుమతి అవుతుంటాయి. 

భారత్‌లో ప్రధానంగా ఆవాలు, పామాయిల్‌, సోయాబీన్‌, పొద్దుతిరుగుడు నుంచి తయారైన ఎడిబుల్‌ నూనెలను ఎక్కువగా వినియోగిస్తుంటారు. మరో వైపు ఎర్ర కందిపప్పుపై ప్రస్తుతం అమలు చేస్తున్న జీరో దిగుమతి సుంకాన్ని సైతం కేంద్రం పొడిగించింది. మొదట ఎర్ర కందిపప్పుపై దిగుమతి సుంకాన్ని 2021 జులైలో కేంద్రం సుంకాన్ని తగ్గించింది. అప్పటి నుంచి పలుమార్లు గడువును పొడిగిస్తూ వస్తున్నది.