నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా?

నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయడం స్వేచ్ఛా, సక్రమ ఎన్నికల నిర్వహణకు ఎదురు దెబ్బ కాదని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) గురువారం సుప్రీంకోర్టులో తెలిపింది. ఎన్నికల్లో వారు ప్రచారం చేయాలనుకుంటున్నారనే కారణంతో నేరస్తులైన రాజకీయ నేతలను అరెస్టు చేయకుండా ఎలా రక్షణ కల్పిస్తామని ఇడి ప్రశ్నించింది. 

వారిపట్ల భిన్నంగా వ్యవహరించడమనేది రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఇడి 87 పేజీల అఫిడవిట్‌ను కోర్టుకు అందజేసింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రివాల్‌ అరెస్టు చేయడం వెనుక గల ఉద్దేశాలపై విమర్శలు వెల్లువెత్తాయి. పాలక బిజెపికి రాజకీయ విభాగంగా ఇడి మారిపోయిందని, ఎన్నికల ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకోవడమే అరెస్టు వెనుక ఉద్దేశమని ఆప్‌ సహా ప్రతిపక్షాలన్నీ విమర్శించాయి.

సామాన్యుడైన నేరస్తుడికి భిన్నంగా రాజకీయ నేత పట్ల వ్యవహరించడమనేది ఏకపక్షంగా, హేతుబద్ధం కాని రీతిలో అరెస్టు అధికారాలను ఉపయోగించడం కిందకు వస్తుందని, ఇది, రాజ్యాంగంలోని 14వ అధికరణ కింద సమానత్వ హక్కును ఉల్లంఘిస్తుందని ఇడి పేర్కొంది.  మనీ లాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి దోషి అని సూచిస్తున్న సాక్ష్యాధారాల ఆధారంగానే కేజ్రివాల్‌ అరెస్టు జరిగిందని ఇడి తెలిపింది. అరెస్టు అనేది దర్యాప్తులో భాగమని వ్యాఖ్యానించింది. అరెస్టుతో సహా దర్యాప్తు అనేది దర్యాప్తు సంస్థకు ప్రత్యేకంగా రిజర్వ్‌ చేయబడిన అంశమని పేర్కొంది. 

కేజ్రివాల్‌ ఈ దర్యాప్తు ప్రక్రియను అడ్డుకోవడానికి అనేక చర్యలు తీసుకున్నారని, తొమ్మిది సార్లు సమన్లు పంపినా వాటిని పట్టించుకోలేదని, అస్సలేమాత్రం సహకరించడం లేదని ఇడి తెలిపింది. సోదాల సమయంలో ఇంటరాగేషన్‌ సందర్భంగా అడిగిన చిన్న చిన్న ప్రశ్నలకు కూడా ఆయన సహకరించకపోవడం లేదా ఎగవేత సమాధానాలు ఇవ్వడం చేశారని, ఫలితంగా అరెస్టుకు దారి తీసిందని ఇడి పేర్కొంది.