8.38 శాతం పెరిగిన దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి

దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ మధ్య కాలంలో 8.38శాతం పెరిగిందని కేంద్రం తెలిపింది. 2023-24 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- నవంబర్ కాలంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి పెరగడంతో మొత్తం 779.1 బిలియన్ యూనిట్లకు చేరిందని కోల్‌ మినిస్ట్రీ ఒక ప్రకటనలో తెలిపింది. 
 
ఏడాది కిందట ఇదే సమయంలో దేశీయ బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 718.83 బిలియన్ యూనిట్లుగా నమోదైంది. అలాగే భారత్ విద్యుత్ ఉత్పత్తి 7.71 శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన పెరుగుదల, రుతుపవనాల ఆలస్యం, కొవిడ్‌ అనంతరం వాణిజ్య కార్యకలాపాలు పునః ప్రారంభం కారణంగా బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి సంవత్సరానికి 11.19శాతం వృద్ధిని నమోదు చేసింది. 
 
విద్యుత్‌కు డిమాండ్ పెరుగుతున్నప్పటికీ, బొగ్గు దిగుమతులు క్షీణించి 15.16 మిలియన్‌ టన్నులకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 15.16 మిలియన్ టన్నులు, గత ఏడాది ఇదే కాలంలో 27.2 మిలియన్ టన్నులుగా ఉండేదని కోల్‌ మినిస్ట్రీ పేర్కొంది.  లభ్యతను పెంచడంతో పాటు దిగుమతి చేసుకున్న బొగ్గు స్థానంలో బొగ్గు ఉత్పత్తిని మరింత పెంచే లక్ష్యంతో ప్రభుత్వం బొగ్గు ఉత్పత్తిని మరింతగా పెంచే ప్రయత్నాలు చేస్తుందని తెలిపింది.