ఆమ్నెస్టీపై సిబిఐ అనుబంధ చార్జిషీట్‌

విదేశీ నిధుల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా, దాని మాజీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆకర్‌ పటేల్‌, మరో ఆరుగురు వ్యక్తులు, సంస్థలపై సిబిఐ అనుబంధ చార్జిషీట్‌ దాఖలు చేసింది. 
 
ఈ జాబితాలో పటేల్‌తో పాటు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ప్రయివేట్‌ లిమిటెడ్‌, ఇండియన్స్‌ ఫర్‌ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ట్రస్ట్‌, ఏఐఐపీఎల్‌ మాజీ డైరెక్టర్లు శోభా మథారు, నందిని ఆనంద్‌ బసప్ప, మినార్‌ వాసుదేయో పింపుల్‌, ఏఐఐపీఎల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ మోహన్‌ ప్రేమానంద ముండ్కూర్‌, దాని అధీకృత సంతకందారు రాజ్‌ కిష్‌లు ఉన్నారు. 
 
నిందితులపై ఐపీసీలోని సెక్షన్‌ 120బి, విదేశీ కాంట్రిబ్యూషన్‌ (రెగ్యులేషన్‌) చట్టం, 2010లోని నిబంధనల ప్రకారం సీబీఐ అభియోగాలు మోపింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌  యునైటెడ్‌ కింగ్‌డమ్‌ నుంచి విదేశీ విరాళాలను స్వీకరించడానికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా ఫౌండేషన్‌ ట్రస్ట్‌కు 2011-12లో అనుమతి లభించిందని సీబీఐ తెలిపింది. 
 
అయితే, భద్రతా ఏజెన్సీల నుంచి ప్రతికూల ఇన్‌పుట్‌ల కారణంగా అనుమతి రద్దయ్యింది. భారత్‌లోని లాభాపేక్ష లేని సంస్థలు విదేశీ నిధులను స్వీకరించాలంటే అవి తప్పనిసరిగా విదేశీ కాంట్రిబ్యూషన్‌ (నియంత్రణ) చట్టం కింద నమోదు చేయబడాలి. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఇండియా.. భారత, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నిలుస్తుందని తెలిపింది.