సంజయ్ సింగ్‌ బెయిల్ పిటిషన్‌ తిరస్కరణ

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో మనీ లాండరింగ్ కింద అరెస్టయిన ‘ఆప్’ సీనియర్ నేత, ఎంపీ సంజయ్ సింగ్‌ కు మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం ఆయన చేసుకున్న దరఖాస్తును ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు శుక్రవారంనాడు తోసిపుచ్చింది. బెయిల్ మంజూరు అంశంపై విచారణను గురువారం వాయిదా వేసిన కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది.

కేసు విచారణ సందర్భంగా సింగ్ తరఫున హాజరైన అడ్వకేట్ మెహిత్ మాధుర్, తన క్లయింట్‌ను అరెస్టు చేయడానికి ముందు ఈడీ ఒక్కసారి కూడా ఆయనను పిలిపించలేదని, అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరా, ఇతర సాక్ష్యలు ఇచ్చిన స్టేట్‌మెంట్లు పరస్పర భిన్నంగా ఉన్నాయని కోర్టుకు తెలిపారు. 

మరోవైపు, సింగ్ బెయిల్ అప్లికేషన్‌ను ఈడీ వ్యతిరేకించింది. నిందితుడు సంజయ్‌సింగ్‌ను ఇంకా ప్రశ్నించాల్సి ఉందని, కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయన బెయిలుపై విడుదలైతే విచారణకు విఘాతం కలుగుతుందని, సాక్ష్యాలను తారుమారు చేయడం, సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని ఈడీ వాదించింది. 

ఈ నేపథ్యంలో బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దర్యాప్తు సంస్థ ఐదవ అనుబంధ ఛార్జిషీటుకు చెందిన డాక్యుమెంట్ల ప్రతిని సింగ్‌కు అందజేయాలని ఈడీని ఆదేశించారు. మనీ లాండరింగ్ కేసు కింద గత అక్టోబర్ 4న సింగ్‌ను ఈడీ అరెస్టు చేసింది. 

2021-2022 ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో సింగ్ ప్రమేయం ఉందని, కొందరు లిక్కర్ తయారీదారులు, హోల్‌సెల్, రిటైలర్లకు లబ్ధి చేకూర్చేలా పాలసీ ఉందని ఈడీ ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణలను సింగ్ తోసిపుచ్చడమే కాక, తాము ఎలాంటి తప్పదాలకు పాల్పడలేదని చెబుతున్నారు.