అక్రమాస్తుల కేసులో డీఎంకే మంత్రికి మూడేళ్ల జైలు శిక్ష

అక్రమాస్తుల కేసులో తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడికి భారీ షాక్ తగిలింది. ఈ కేసులో మంత్రి సహా ఆయన భార్య విశాలక్ష్మిని దోషులుగా నిర్దారించిన మద్రాస్‌ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ సందర్భంగా కింది న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పక్కనబెట్టింది.  మద్రాస్ హైకోర్టు మూడు సంవత్సరాల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పగా శిక్షను తగ్గించాలని కోరుతూ పొన్ముడి, ఆయన భార్య కోర్టుకు మెడికల్ రికార్డు సమర్పించారు. మంత్రి వయసు 73 సంవత్సరాలు, ఆయన భార్య వయసు 60 ఏళ్లని, కాబట్టి శిక్షను తగ్గించాలని కోరారు.

దానితో,  పొన్ముడికి సాధారణ జైలుశిక్ష, ఆయనకు, ఆయన భార్యకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునేందుకు వీలుగా శిక్షను సస్పెండ్‌ చేయాలన్న పొన్ముడి తరఫున సీనియర్ న్యాయవాది విజ్ఞ‌ప్తి చేయగా కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 

అప్పీలుకు 30 రోజులు గడువు ఇచ్చిన కోర్టు అప్పటివరకూ శిక్షను అమలు చేయకుండా నిలిపివేసింది. మంత్రి పొన్ముడి, ఆయన భార్య రూ.1.79 కోట్ల అక్రమాస్తులను కూడబెట్టినట్టు నిర్ధారించింది. రెండు రోజుల కిందట వారిని దోషులుగా నిర్దారించిన ఉన్నత న్యాయస్థానం గురువారం శిక్షలను విధించింది.
2017లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను జస్టిస్‌ జి.జయచంద్రన్‌ అనుమతించారు. 
విల్లుపురంలోని అవినీతి నిరోధక చట్టం కేసుల్లో 2016, ఏప్రిల్‌ 18న ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని కూడా న్యాయమూర్తి పక్కనబెట్టారు. కోర్టు తీర్పుతో మంత్రి పదవికి పొన్ముడి రాజీనామా చేసే అవకాశం ఉంది.   ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. క్రిమినల్ కేసులో దోషిగా నిర్దారణ అయి, మూడేళ్ల జైలు శిక్ష ఖరారయితే ఎంపీ లేదా ఎమ్మెల్యే ఆటోమేటిక్‌గా అనర్హుడవుతారు.  

ఈ కేసు 2006-2011 హయాం నాటిది. అప్పట్లో పొన్ముడి రూ.1.36 కోట్లకుపైగా ఆస్తులు కూడబెట్టినట్టు 2011లో అన్నాడీఎంకే నేత కోర్టుకెక్కారు. తాజా కేసులో మంత్రి పొన్ముడిని నిర్దోషిగా పేర్కొంటూ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు అసమంజసంగా ఉన్నాయని జస్టిస్ జయచంద్రన్‌ వ్యాఖ్యానించారు. ఆయనకు వ్యతిరేకంగా భారీ సాక్ష్యాలను ఎత్తిచూపారు. ట్రయల్ కోర్టు తీర్పును స్పష్టంగా తప్పు అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్టాలిన్ తన మంత్రివర్గం నుంచి పొన్ముడిని తప్పించాలని తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి డిమాండ్ చేసిన మర్నాడే ఆయనకు శిక్ష ఖరారు కావడం గమనార్హం. డీఎంకే అధికారంలో ఉన్నప్పుడు 2006 ఏప్రిల్‌ 13 నుంచి 2010 మార్చి 31 మధ్య కాలంలో నిందితులు రూ.1.79 కోట్ల ఆక్రమాస్తులను కూడబెట్టినట్లు ప్రాసిక్యూషన్‌ పేర్కొంది.