‘జై భారత్ నేషనల్ పార్టీ’ పేరుతో ఏపీలో కొత్త పార్టీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తాను కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. జై భారత్ నేషనల్ పేరిట కొత్త పార్టీని ఆయన శుక్రవారం విజయవాడలో ప్రకటించారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నట్లు తెలిపారు.
జై భారత్ నేషనల్ పార్టీ జెండాను లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పార్టీ జెండాలో కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయి. లక్ష్మీ నారాయణ పిడికిలి బిగించినట్లుగా ఉన్న ఫొటో సైతం జై భారత్ నేషనల్ పార్టీ జెండాలో ముద్రించి ఉండటం గమనించవచ్చు.  తమ పార్టీ పెట్టిన పార్టీ కాదన్న ఆయన… ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని చెప్పుకొచ్చారు.
సమస్యల పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని అంబేడ్కర్ చెప్పారని పేర్కొంటూ ఆ దిశగా అడుగులేస్తూ రాజకీయాల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.  గత ఎన్నికల్లో పోటీ తర్వాత మరింత స్ఫూర్తితో పనిచేశానని తెలిపారు.  అన్ని వర్గాల ప్రజలను కలిసి అభిప్రాయాలు తీసుకున్నానని చెబుతూ రాజకీయాలు అంటే మోసం కాదు, సుపరిపాలన అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో నిరుద్యోగానికి ప్రధాన కారణం ప్రత్యేక హోదా రాకపోవడమేనని అని చెప్పారు.  ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో అన్ని పార్టీలూ విఫలమయ్యాయని విమర్శించారు.  ఒకరు అభివృద్ధి పేరుతో ఒక నగరం కట్టడాన్ని లక్ష్యంగా ఒకరు పని చేశారు… అవసరాల పేరుతో అభివృద్ధి ని పక్కన పెట్టింది మరొకరు.. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చెయ్యడానికి తాను పార్టీ ఏర్పాటు చేసినట్లు లక్ష్మీనారాయణ వెల్లడించారు.
 
ప్రత్యేక హోదా తీసుకొచ్చేందుకు పుట్టిందే జైభారత్ నేషనల్ పార్టీ అని లక్ష్మీనారాయణవెల్లడించారు. ఏపీ అనేది వ్యవసాయ ఆధారిత రాష్ట్రమని చెబుతూ ఇక్కడే అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలను సృష్టించవచ్చని ఆయన తెలిపారు. ఇలాంటి అంశాలను గుర్తించి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 
 
ఏపీని గుజరాత్ కంటే ముందువరుసలో ఉంచుతామని తెలిపారు. ప్రస్తుతం చూస్తుంటే… కొన్ని కుటుంబాలకు మాత్రమే రాజకీయాలు పరిమితమయ్యాయని ఆయన తెలిపారు. కుటుంబ పాలన స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఈ పరిస్థితి కనిపిస్తోందని చెప్పారు.

బూటకపు రాజకీయాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు.
 
వీళ్లు తిన్నారని వాళ్లు.. వాళ్లు తిన్నారని వీళ్లు విమర్శించుకుంటున్నారని మండిపడ్డారు. ఎవరూ అవినీతికి పాల్పడలేని వ్యవస్థను తీసుకొచ్చేందుకే పార్టీ స్థాపించినట్లు తెలిపారు. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలమని చెప్పారు.  అభివృద్ధితో అవసరాలు తీర్చేందుకు, బానిసత్వాన్ని రూపుమాపేందుకు పుట్టిందే జేబీఎన్‌పీ అని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో కొత్త పార్టీతో లక్ష్మీనారాయణ ముందుకు రావడం రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
 
మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన లక్ష్మీనారాయణ డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్ర సర్వీసుల్లోకి డిప్యూటేషన్ పై వెళ్లి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంత రాష్ట్రమైన హైదరాబాద్‌లో విధుల్లో చేరారు. ఆ తర్వాత సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా సంచలన కేసుల్లో దర్యాప్తు చేపట్టి కీలకంగా వ్యవహరించారు. పలు కీలక కేసుల దర్యాప్తు చేపట్టారు. ఆ తర్వాత స్వచ్ఛంద పదవీ విరమణ  తీసుకున్నారు.