`ప్రధాన మంత్రి అభ్యర్థి’పై `ఇండియా’ కూటమిలో ప్రకంపనాలు

ఇటీవల జరిగిన ప్రతిపక్ష ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున్ ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడం భాగస్వామ్య పక్షాలలో ప్రకంపనలు సృష్టిస్తోంది. కేవలం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఇరకాటంలో పెట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చేందుకు ఉద్దేశించినట్లు అనుకొంటున్నప్పటికీ లోతైన వ్యూహం ఉన్నట్టు వెల్లడి అవుతుంది.
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి గెలిచి, బలాన్ని పెంచుకోవడం ముఖ్యమని, మిగిలిన విషయాలను తర్వాత నిర్ణయించుకోవచ్చని ఖర్గే వెంటనే ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన్నప్పటికీ పలు పార్టీల నేతలు ఈ అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకు రావడం పట్ల కన్నెర్ర చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. కూటమి ఏర్పడి ఆరు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కనీసం కన్వీనర్ ను కూడా ఎంపిక చేసుకోలేదు. తానే సారధ్యం వహిస్తున్నట్లు కాంగ్రెస్ వ్యవహరిస్తున్నది.
 
ముఖ్యంగా ప్రతిపక్షాలను ఉమ్మడి వేదికపైకి తీసుకొచ్చేందుకు సుదీర్ఘంగా కసరత్తు చేసి, మొదటగా గత జూన్ లో పాట్నాలో సమావేశం ఏర్పాటు చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ ప్రతిపాదన పట్ల తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది. తన హిందీ ప్రసంగానికి ఆంగ్లంలో అనువాదం కావాలని డీఎంకే నేత టి ఆర్ బాలు అడిగితే నితీష్ అసహనం వ్యక్తం చేసేందుకు అసలు కారణం ప్రధాని అభ్యర్థి అంశమే అని చెబుతున్నారు.
 
జేడీయూ నేతలు ఈ అంశంపై తమ ఆగ్రహాన్ని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. ”అసలు ఖర్గే ఎవరు? ఆయన గురించి ఎవరికీ తెలియదు? బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ పీఎం అభ్యర్థి కావాలి” అంటూ జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ నిప్పులు చెరిగారు. ”ఖర్గే-ఫర్గే ఎవరో జనాలకు తెలియదు. నాకు కూడా ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడనే విషయం తెలియదు. ఏ ఒక్కరికీ ఆయన ఎవరో తెలియదు. జనాలకు అయితే అస్సలు తెలియదు. జనాలకు తెలిసింది నితీష్ కుమార్ మాత్రమే. ఆయనే ప్రధాని కావాలి. ఆయన గురించి యావద్దేశానికి తెలుసు” అని ఎద్దేవా చేశారు.
 
కాంగ్రెస్ పార్టీని జనం నమ్మడం లేదని స్పష్టం చేస్తూ ఆ పార్టీని ముందు పెట్టుకొని ఎన్నికలకు పోలేమని మండల్ తేల్చి చెప్పారు. కాంగ్రెస్ విశ్వసించదగిన పార్టీకాదని, ఆ పార్టీ హయాంలో ద్రవ్యోల్బం, ధరల పెరుగుదలతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొంటూ కాంగ్రెస్ పాలసీల వల్లే బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఆ కారణంగానే పాత ముఖాలకు బదులు కొత్త ముఖాలను ఎన్నుకోవాల్సి ఉంటుందని అంటూ చెప్పారు.
 
ఖర్గే పేరును కొందరు ప్రతిపాదించడంపై నితీశ్ కుమార్ కినుక వహించినట్ల్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం నితీశ్‌తో ఫోన్‌లో మాట్లాడి ఈ విషయంలో కాంగ్రెస్ వైఖరిని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే నితీశ్ మాత్రం ఖర్గే గురించి ప్రస్తావన వచ్చినట్లు తనకు తెలియదని రాహుల్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. 
 
ప్రతిబీహార్ క్యాబినెట్ విస్తరణ ప్రస్తావన కూడా వారి మధ్య వచ్చింది. బీహార్ క్యాబినెట్‌లో కాంగ్రెస్ మంత్రుల సంఖ్యను పెంచడానికి తాను సిద్ధమని రాహుల్‌కు నితీశ్ చెప్పారు. అయితే, ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ నుంచి స్పష్టత లేనందువల్లే క్యాబినెట్ విస్తరణలో జాప్యం జరుగుతోందని ఆయన చెప్పారు. ప్రధాని పదవికి ఖర్గే పేరు ప్రతిపాదించినపుడు ఆర్జేడీ నేతలు సహితం మౌనంగా ఉండటం పట్ల నితీష్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తున్నది.
 
బీహార్ అధికార కూటమిలో చిచ్చు రేపటానికా అన్నట్లు ముఖ్యమంత్రి పదవిలో తన కుమారుడు, బీహార్ ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ కూర్చోవాలని లాలూ ప్రసాద్ కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి, బిజెపి నేత  గిరిరాజ్ సింగ్ వెల్లడించడం కలకలం రేపుతోంది. తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేస్తేనే బీహార్ అభివృద్ధి చెందుతుందని విమానంలో పాట్నాకు వెళుతుండగా గిరిరాజ్‌తో లాలూ ప్రసాద్ అన్నట్లు తెలుస్తోంది.
దేశంలో తొలి దళిత ప్రధాన మంత్రి ఖర్గే అవుతారని మమతా బెనర్జీ, కేజ్రీవాల్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు కూటమి సమావేశం అనంతరం ఎండిఎంకె నాయకుడు వైకోతో సహా పలువురు నాయకులు ధ్రువీకరించారు. ఒక విధంగా తమిళనాడుకు చెందిన డీఎంకే, ఇతర మిత్రపక్షాలు సహితం ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నట్లు వెల్లడి అవుతుంది.