`జన్నన్న’ రామోజు షణ్ముఖ మృతి

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్, బిజెపిలలో పూర్తి సమయ కార్యకర్తగా, పలు ప్రజా ఉద్యమాలలో రాటుతేలి, అనేకమంది సామజిక కార్యకర్తలకు స్ఫూర్తి కేంద్రంగా నిలిచిన `జన్నన్న’గా అందరూ ఆప్యాయంగా పిలుచుకునే రామోజు షణ్ముఖ ఇక లేరు. శనివారం  తెల్లవారుజామున 1.20 గంటలకు వైకుంఠ ఏకాదశి పర్వదిన ఘడియలలో హైదరాబాద్ లోని స్వగృహంలో  మృతి చెందారు. ఆయనకు భార్య శోభారాణి, ఒక కుమార్తె తేజస్వి ఉన్నారు. భార్య న్యాయవాది.
 
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ మాల్బాయిలో సాంప్రదాయ విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన షణ్ముఖ, స్థానిక పరిస్థితుల ప్రభావంతో చిన్నప్పటినుండే సంఘ్ పరివార్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులయ్యారు. అప్పటినుండి ఆర్.ఎస్.ఎస్., ఏబీవీపీ, హిందూ వాహిని, బజరంగ్ దళ్, బీజేపీ సంస్థల బలోపేతానికి తన జీవితాన్ని మొత్తం ధారపోసాడు. 
 
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాలతో సహా  ఎంతో మంది కేంద్ర మంత్రులు, ఉన్నత పదవుల్లో ఉన్న నాయకులు, పలు రాష్ట్రాల గవర్నర్లు సామాజిక కార్యంలో జన్నన్న సమకాలీకులే. ఎబివిపి రాష్త్ర సహా సంఘటనా కార్యదర్శిగా కూడా పనిచేశారు.
 
నల్గొండ పట్టణంలో పెద్ద గడియారం కుడివైపు ఉన్న పాత బస్తీకి ఎడమ వైపు ఉండే రామగిరి ల మధ్య సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, జీవన విధానంలో గణనీయమైన వ్యత్యాసం  ఉండేది, ప్రస్తుతం కూడా ఉంది. సహజంగానే తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల్లో మాదిరిగానే నల్గొండ పట్టణంలోని పాత బస్తిగా భావిస్తున్న సిమెంట్ రోడ్, అక్కచెల్మ, జామ్ మసీద్, జమ్మలగూడ, మాన్యం చెల్క, బార్ పెట్, నెహ్రు గంజ్, చౌరస్తా…. మరికొన్ని స్ట్రీట్ లు  మతపరంగా అత్యంత సున్నితంగా ఉండేవి.
 
ఆ మాటకొస్తే, మొత్తం అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హైదారాబాద్ అనంతరం ఆ ప్రభావంతో మత ఘర్షణలు జరిగే వాటిల్లో నల్గొండ పట్టణం, భైసా, బోధన్ లు ముందు వరసలో ఉండేవి. అటువంటి ప్రాంతంలో రాటుతేలిన సామజిక కార్యకర్తగా పరిణితి చెందారు. నల్గొండ పట్టణంలో గుండాయిజం, దాదాగిరి, రౌడీయిజం లేకుండా కృషి చేశారు. 
 
ఇందిరా గాంధీ ప్రకటించిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని  1976లో దాదాపు తొమ్మిది నెలల 15 రోజులు జైలు జీవితం గడిపారు. భారతీయ జనతా పార్టీ బలోపేతానికి ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, బెంగాల్ లలో తిరిగి పనిచేశారు. ఇక, మన రాష్ట్రంలోని రాయలసీమ బీజీపీ ఇంఛార్జిగా,  ఉత్తర తెలంగాణా జిల్లాల భాద్యుడిగా, హిందూ వాహిని రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశారు.
నల్గొండ ప్రభుత్వ నాగార్జున డిగ్రీ కళాశాలకు 1980 – 81లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో మొత్తం ప్యానెల్ ఏబీవీపి గెలిచింది. అప్పుడు షణ్ముఖ కళాశాల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఎబివిపి బలోపేతంకు విశేషంగా కృషిచేసిన వారిలో ఉన్నారు.
 
నల్లగొండ పట్టణంలో ఒక మతం వారు షణ్ముఖ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఒకవైపు అతివాద రాడికల్ స్టూడెంట్ యూనియన్, పీడీఎస్ యు, మితవాద ఏ.ఎస్.ఐ.ఎఫ్, ఎస్.ఎఫ్.ఐ లు, అధికార పార్టీ అండగా ఉన్న ఎన్.ఎస్.యు.ఐ లనుండి… ఎన్నోప్రతికూల పరిస్థితులలో కొన్నిసార్లు ప్రాణాపాయాలనుండి తప్పించుకొని ఎబివిపి కార్యక్రమాల నిర్వహణలో విశేషంగా కృషి చేశారు. 


ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కేసీఆర్ స్వయంగా ఆహ్వానించడంతో 2007లో ఆయనతో జత కట్టారు. నల్లగొండ లోని జన్న్న ఇంటికి కేసీఆర్, ప్రొఫెసర్ జయ శంకర్ లు వచ్చి దాదాపు మూడు గంటలు గడిపారు.  తిరిగి, రాష్ట్రం సిద్దించడంతో తన మాతృ సంస్థ బీజీపీలోకి తిరిగి  వచ్చారు. 2019 లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు.


అత్యంత సాధారణ జీవితం గడిపే షణ్ముఖ అందరిలో కలిసిపోతుంటారు. ఎటువంటి క్లిష్ట పరిస్థితులనైనా మనోనిబ్బరంతో ఎదుర్కొంటుంటారు. తన అమ్మగారైన దివంగత శ్రీరామోజు శారదాంబ ఫౌండేషన్ పేరుతొ సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టారు. తన ఐదేళ్ల చిన్న తనంలోనే తండ్రిని కోల్పోయాడు. చిన్న తనం నుండే జీవన సమరం చేసిన జన్నన్న పాన్ షాప్ కూడా నడిపాడు.