భారత చరిత్రలో కొత్త క్రిమినల్ చట్టాలతో నవయుగం

పార్లమెంటులో 3 క్రిమినల్ శిక్షా స్మృతి బిల్లులు ఆమోదం పొందడం పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలో ఇది ఒక పెద్ద మార్పు అని, కొత్త పరిణామాల ప్రారంభానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందున ముఖ్యమైన సంఘటనగా ప్రధాని మోదీ దీనిని అభివర్ణించారు. 
 
దీనితో మన దేశంలో వలస పాలన చట్టాలకు కాలం చెల్లిందని స్పష్టం చేశారు. భారత చరిత్రలో ఈ కొత్త చట్టాలు అమలుతో ప్రజా సేవా, సంక్షేమం విషయంలో నవయుగం ప్రారంభమవుతుందని చెప్పారు. ట్విట్టర్ లో చేసిన పోస్టులో ప్రధాని మోదీ “భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, 2023, భారతీయ న్యాయ సంహిత, 2023 మరియు భారతీయ సాక్ష్యా అధినియం, 2023 ఆమోదించడం మన చరిత్రలో చాలా ముఖ్యమైన ఘట్టం” అని తెలిపారు. 
 
ఈ బిల్లులు భారతీయ శిక్షా స్మృతి స్థానంలో భారతీయ న్యాయ ( రెండవ) సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్ష (రెండవ) సంహిత, ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ  సాక్ష్య (రెండవ) బిల్లు రూపాంతరం చెందుతాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సంస్కరణల పట్ల భారతదేశపు నిబద్ధతకు ఇవి నిదర్శనమని ఆయన తెలిపారు.

ఈ బిల్లులు మన సమాజంలోని పేద అట్టడుగు బలహీన వర్గాలకు మెరుగైన రక్షణను అందిస్తాయని, దేశపు శాంతియుత ప్రయాణం వైపు పురోగమనానికి ఉపయోగపడతాయని తెలిపారు. దేశద్రోహం పై రాజ్యాంగంలోని కాలం చెల్లిన సెక్షన్లకు భారతదేశం వీడ్కోలు పలుకుతుందని ప్రధాని మోదీ చెప్పారు.

ఇదిలా వుండగా గురువారం పార్లమెంటు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధీనియం అనే 3 శిక్షా స్మృతులను ఆమోదించింది. ఈ బిల్లులు 1860 భారతీయ శిక్షా స్మృతి, 1898 క్రిమినల్ ప్రొసిజర్ స్మృతి, 1872 భారతీయ సాక్ష్యాధారాల చట్టం స్థానంలో చట్టాలుగా అమలవుతాయి. ఈ మూడు బిల్లులు చట్టాలుగా ఈ ఏడాది చివరి నాటికే అమలులోకి రానున్నాయి. ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నుండి చివరకు తీర్పు వరకు అన్నీ ఆన్ లైన్ అవుతాయి.