`ఇండియా’ కూటమిలో శివసేన చిచ్చు

లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు అంశం ‘ఇండియా’ కూటమిలో చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం తలనొప్పి కలిగిస్తున్నది. ఆయా రాష్ట్రాల్లో భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారం ఇంకా మంతనాల స్థాయిలోనే ఉండగానే మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాకరే  సారథ్యంలోని శివసేన శుక్రవారంనాడు చేసిన ప్రకటన ఈ అనుమానాలకు తావిస్తోంది. 

మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 23 స్థానాల్లో తాము పోటీ చేయనున్నట్టు ఉద్ధవ్ వర్గం శివసేన ప్రకటించింది. ఆ రాష్ట్రంలో శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ (శరద్ పవార్ వర్గం) భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. ఇండియా కూటమిలోనూ ఈ మూడు పార్టీలు కొనసాగుతున్నాయి.  గత లోక్‌సభ ఎన్నికల్లో శివసేన, బీజేపీ కలిసి మహారాష్ట్రలో పోటీ చేశాయి. బీజేపీ 25 స్థానాల్లో పోటీ చేయగా, తక్కిన 23 స్థానాల్లో శివసేన పోటీ చేసింది. బీజేపీ 23 స్థానాలు గెలుచుకోగా, శివసేన 18 సీట్లు గెలుచుకుంది.

మరోవైపు, భాగస్వామ్య పార్టీలతో పొత్తుల వ్యవహారంలో అంతా సజావుగానే జరుగుతుందని కాంగ్రెస్ గాంభీర్యం ప్రకటిస్తుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ఖరారు చేస్తామని, బీజేపీ, దాని ప్రత్యర్థి పార్టీలపై ఇండియా బ్లాక్ పోటీకి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపింది.

ఇండియా బ్లాక్ భాగస్వామ్యుల మధ్య సీట్ల పంపకాలపై అడిగినప్పుడు, తాము ఇప్పటికే అలయెన్స్ కమిటీని ఏర్పాటు చేశామని, కమిటీకి పార్టీ అధ్యక్షుడు స్పష్టమైన ఆదేశాలిచ్చారని, ఈ నెలలోనే భాగస్వామ్య పార్టీలతో చర్చలు జరుగుతాయని వివరించింది. కాగా, సీట్ల సర్దుబాటు అంశపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ, దీనిపై సోనియాగాంధీ, మల్లికార్జున్ ఖర్గే, మహారాష్ట్రకు చెందిన ఇతర నేతలతో మాట్లాడుతున్నామని, తదుపరి చర్చలు న్యూఢిల్లీలో జరుగుతాయని చెప్పారు. 

ఇతర భాగస్వామ్య పార్టీలైన ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీ, పశ్చిమబెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ సంప్రదాయ సీట్లకు కట్టుబడి ఉంటామని చెబుతున్నాయి. పంజాబ్, ఢిల్లీలలో అధికారంలో ఉన్న ఆప్ తో; ఉత్తర ప్రదేశ్ లో సమాజావాది పార్టీతో సర్దుబాట్లు సహితం కాంగ్రెస్ కు క్లిష్టతరంగా మారనున్నాయి.  ఢిల్లీ, పంజాబ్ లలో సర్దుబాట్లు జరగాలంటే తమకు హర్యానా, గుజరాత్ లలో ఒకొక్క సీటు అయినా వదలాలని ఆప్ స్పష్టం చేస్తున్నది.