హిందుస్థాన్‌ అంటే హిందీ భాష కాదు

‘మన దేశాన్ని హిందుస్థాన్‌ అని పిలుస్తాం. మన జాతీయ భాష అయిన హిందీ అందరికీ తెలిసి ఉండాలి’ అంటూ బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీవాసుదేవ్ తీవ్రంగా స్పందించారు. హిందూస్థాన్ అంటే హిమాలయాలు, హిందువులు నివసించే ప్రాంతం తప్ప హిందీభాషకు నిలయం కాదని స్పష్టం చేస్తూ  ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా ట్వీట్‌ చేశారు.
‘హిందూస్థాన్ అంటే హిమాలయాలు, హిందువులు నివసించే ప్రాంతం తప్ప హిందీ భాషకు నిలయం కాదు. దేశంలోని అన్ని భాషలకు సమాన హోదా ఇచ్చే ఉద్దేశంతో.. ఆ భాషను మాట్లాడేవారి సంఖ్యనుబట్టి కాకుండా భాషాపరంగా రాష్ట్రాలను విభజించారు’ అంటూ ప్రముఖ సోషల్ మీడియా ఎక్స్‌లో తెలిపారు

`కాబట్టి భాషాపరమైన వైవిధ్యాన్ని గౌరవించాలి. సొంతభాష, సాహిత్యం, సంస్కృతితో ముడిపడిన అనేక రాష్ట్రాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అందువల్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని మిమ్మల్ని (నితీశ్‌ కుమార్‌ని ఉద్దేశించి) గౌరవపూర్వకంగా వేడుకుంటున్నా’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

కాగా, ఢిల్లీలో మంగళవారం జరిగిన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌ సమావేశంలో నితీశ్‌ కుమార్‌ హిందీలో ప్రసంగించారు. అయితే ఆయన హిందీ ప్రసంగాన్ని డీఎంకే నేత టీఆర్‌ బాలు అర్ధం చేసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో దానిని అనువాదం చేయాలని ఎదురుగా కూర్చొన్న ఆర్జేడీ ఎంపీ మనోజ్‌ ఝాకు సైగ చేశారు. 

హిందీ ప్రసంగాన్ని అనువదించేందుకు నితీశ్‌ కుమార్ అనుమతిని మనోజ్‌ కోరారు. ఈ నేపథ్యంలో ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘మన దేశాన్ని హిందుస్థాన్ అని పిలుస్తాం. హిందీని మన జాతీయ భాష అని వ్యవహరిస్తాం. మనకు ఆ భాష తెలిసి ఉండాలి’ అంటూ నితీశ్‌ అసహనం వ్యక్తం చేశారు. అలాగే తన హిందీ ప్రసంగాన్ని అనువదించవద్దని మనోజ్‌తో చెప్పారు. దీంతో నితీశ్‌ వ్యాఖ్యలు కాస్తా తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి.