
పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. లోక్‌సభలో దుండగుల అలజడి, అసాధారణ రీతిలో 146 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు.. తదితర పరిణామాల మధ్య షెడ్యూల్ కంటే ఒక రోజు ముందే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గురువారం ముగిశాయి. చివరి రోజు లోక్‌సభలో మరో ముగ్గురు ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది.
విపక్ష ఎంపీల గైర్హాజరీలో పలు కీలక బిల్లులను మూజువాణి ఓటుతో కేంద్రం ఆమోదింపజేసుకున్నది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో తీసుకొచ్చిన 3 నేర న్యాయబిల్లులు, టెలికం బిల్లు, సీఈసీ, ఈసీ నియామకాలకు సంబంధించిన బిల్లులు ఈ జాబితాలో ఉన్నాయి.
లోక్‌సభ ఇప్పటికే ఆమోదించిన భారతీయ న్యాయసంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. గురువారం రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాట్లాడుతూ ఈ బిల్లుల ద్వారా బాధితులకు మూడేండ్లలోగా న్యాయం దక్కుతుందని చెప్పారు.
మరోవైపు, జాతీయ భద్రత పేరుతో ఏ మొబైల్ నెట్‌వర్క్‌ను అయినా టేకోవర్ చేసుకునేందుకు లేదా సస్పెండ్ చేసేందుకు కేంద్రానికి అధికారం కల్పించే టెలికమ్యూనికేషన్ బిల్లుకు కూడా పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. అలాగే సీఈసీ, ఈసీల నియామక ప్యానల్ నుంచి సీజేఐని తొలగించే బిల్లుకూ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
ఈ నెల 13న పార్లమెంట్‌లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసిన తెలిసిందే. ఇద్దరు దుండగులు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూకి, పొగ వదిలి అలజడి సృష్టించడం కలకలం రేపింది. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. సెక్యూరిటీ వైఫల్యంపై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన తెలిపాయి.
ఈ క్రమంలో లోక్‌సభతో పాటు రాజ్యసభలో 146 మంది సభ్యులు సస్పెండ్ అయ్యారు. జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, సెంట్రల్ యూనివర్సిటీల సవరణ బిల్లు కూడా ఆమోదం పొందాయి. అలాగే, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై సస్పెండ్ సైతం విధించారు. డబ్బులకు ప్రశ్నలకు కేసు వ్యవహారంలో దోషిగా నిర్ధారిస్తూ పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ చేసిన సిఫారసుకు సంబంధించిన తీర్మానాన్ని సభలో ఆమోదించిన అనంతరం మహువాను లోక్‌సభ బహిష్కరించింది.
పార్లమెంట్‌లో విపక్షాల గొంతును మోదీ సర్కార్ అణచివేస్తున్నదని విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్‌కు పాదయాత్రను చేపట్టారు. సేవ్ డెమొక్రసీ, పార్లమెంట్ కేజ్‌డ్, డెమొక్రసీ ఎక్స్‌పెల్డ్.. సందేశాల్ని చూపుతూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట్లాడుతూ, ‘భద్రతా వైఫల్యం అంశాన్ని సభలో లేవనెత్తకుండా ప్రధాని మోదీ విపక్ష ఎంపీల పార్లమెంటరీ హక్కుల్ని కాలరాశారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జంతర్‌మంతర్ వద్ద నిరసన కొనసాగిస్తామని విపక్ష ఇండియా కూటమి ప్రకటించింది.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది