ఎలక్షన్ కమిషనర్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం

ప్రధాన ఎన్నికల కమిషనర్ ( సిఇసి), ఎన్నికల కమిషనర్ల నియామకాలను నియంత్రించడంతో పాటుగా వారి సర్వీసలుకు నిబంధనలు రూపొందించే బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది. ‘ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ (అపాయింట్‌మెంట్, కండిషన్స్‌ఫ్ సర్వీస్ అండ్ టెర్మ్ ఆఫ్ ఆఫీస్) బిల్లు2023ను గురువారం స్వల్ప చర్చ అనంతరం లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. 

ఈ బిల్లుకు రాజ్యసభ ఇదివరకే ఈ నెల 12న ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు సిఇసి, ఎలక్షన్ కమిషనర్లను ప్రభుత్వం నియమించేది. కొత్త బిల్లు ప్రకారం ఇకపై సెర్చ్, ఎంపిక కమిటీలు ఈ బాధ్యతను నిర్వర్తించనున్నాయి. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు నిబంధనలు లేవని పేర్కొంటూ 1991 చట్టం స్థానంలో ప్రభుత్వం ఈ కొత్త బిల్లును తీసుకువచ్చింది. 

బిల్లుపై జరిగిన చర్చకు న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ సమాధానమిస్తూ ప్రస్తుతం ఉన్న చట్టాల్లో లోపాలను సరిదిద్ది కొత్త బిల్లును తీసుకు వచ్చామని తెలిపారు. అంతేకాదు సిఇసి, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లు ఉందని వివరించారు.

చట్టాన్ని రూపొందించేంతవరకు ప్రధానమంత్రి నేతృత్వంలో ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన త్రిసభ్య కమిటీ సిఇసి, ఎన్నికల కమిషనర్లను ఎంపిక చేస్తుందని సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో చెప్పిందని మంత్రి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగానే ఈ బిల్లు ఉందని, దానికి వ్యతిరేకం కాదని ఆయన తెలిపారు. 

సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొన్న కమిటీ తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని కూడా ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగంలో పేర్కొన్నట్లుగా అధికారాల విభజనకు అనుగుణంగా కొత్త బిల్లును రూపొందించామని తెలిపారు. సిఇసి, ఇతర కమిషనర్ల హోదా, వేతనాలకు సంబంధించిన నిబంధనలను కూడా దీనిలో పొందుపర్చినట్లు మేఘ్వాల్ తెలిపారు. 

పలు ప్రతిపక్ష పార్టీలు, మాజీ సిఇఓల అభ్యంతరాల నేపథ్యంలో రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ప్రభుత్వం పలు సవరణలను చేర్చింది. ఈ బిల్లు ప్రకారం ఏ కోర్టు కూడా సిఇసి లేదా ఎన్నికల కమిషనర్లపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకొనే వీలుండదు. సిఇసి రాజీవ్ కుమార్, పలువురు ఇతరులపై ఎఫ్‌ఐఆర్ నమోదు యాలని తెలంగాణకు చెందిన స్పెషల్ సెషన్స్ జడ్జి అదేశించడానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు సదరు జడ్జిని సస్పెండ్ చేయాలని ఆదేశిస్తూ ఇటీవల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బిల్లులో ఈ క్లాజ్‌ను చేర్చారు. 

సుప్రీంకోర్టు జడ్జిని ఏ కారణాలతో తొలగించవచ్చో ఆ విధంగా తప్ప మరే విధంగాను సిఇసిని తొలగించడానికి వీలు లేదన్న మరో సవరణను కూడా ఈ బిల్లులో చేర్చారు. ఇక రాష్ట్రపతి ఆమోదముద్రతో ఈ బిల్లు చట్ట రూపం దాలుస్తుంది.

టెలికాం బిల్లుకు ఆమోదం

కాగా, జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా ప్రభుత్వం తాత్కాలికంగా టెలికాం సర్వీసలను తన అధీనంలోకి తీసుకోవడానికి, అలాగే వేలం లేకుండా శాటిలైట్ స్పెక్ట్రంను కేటాయించడానికి వీలు కల్పించే టెలీ కమ్యూనికేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం మూజువాణి ఓటుతో ఆమోదించింది. లోక్‌సభ బుధవారం ఈ బిల్లును స్వల్ప చర్చ అనంతరం ఆమోదించింది.

జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్టా టెలికాం సేవలను తాత్కాలికంగా తన అధీనంలోకి తీసుకోవడానికి, అలాగే శాటిలైట్ స్పెక్ట్రం కేటాయింపునకు వేలం లేని విధానాన్ని కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు.అంతేకాకుండా ప్రజా ఆత్యయిక స్థితి ఎదురయినప్పుడు లేదా ప్రజా భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు టెలికాం నెట్‌వర్క్‌ను కేంద్రం తన చేతుల్లోకి తీసుకోవడానికి కూడా ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. 

కాలం చెల్లిన బ్రిటీష్ కాలం నాటి రెండు చట్టాల స్థానంలో నవభారత ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త బిల్లును తీసుకువచ్చినట్లు బిల్లుపై జరిగిన చర్చకు సమాధానమిస్తూ కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెప్పారు.