
బ్రిటిష్‌కాలం నాటి చట్టాల స్థానంలో కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన క్రిమినల్ చట్టాలకు సంబంధించిన బిల్లును బుధవారం లోక్‌సభ ఆమోదించింది. భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్రం కొత్తగా భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను తీసుకువచ్చింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ప్రవేశపెట్టిన కొన్ని కొత్త సవరణలతో పాటు మూడు బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఆయా బిల్లులపై బుధవారం లోక్‌సభలో చర్చ జరిగింది. భారీగా సభ్యులు సస్పెండ్ అయిన తర్వాత బిల్లులకు ఆమోదముద్ర పడింది. గతంలో ప్రతిపక్ష నాయకులు అధిర్ రంజన్ చౌదరి, సీనియర్ న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ తదితర ఎంపీలు పలు అంశాలను లేవనెత్తారు.
అయితే, అధికార బిజెపి, మిత్రపక్షాలు బిల్లులను సమర్థించాయి. భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష, సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చకు హోంమంత్రి బదులిస్తూ ఈ మూడు ప్రతిపాదిత చట్టాలు ఉగ్రవాదానికి స్పష్టమైన నిర్వచనాన్ని కలిగి ఉన్నాయని తెలిపారు. కొత్త నేర చట్టాల ప్రకారం మూక హత్యకు పాల్పడిన వారికి మరణశిక్ష విధిస్తారని హెచ్చరించారు.
అలాగే గాంధీ, తిలక్, సర్దార్ పటేల్ వంటి ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను అనేక ఏళ్లు జైలులో ఉంచిన బ్రిటీష్ వలస పాలన నాటి దేశ ద్రోహం చట్టాన్ని రద్దు చేసినట్లు ప్రకటించారు. దేశద్రోహాన్ని నేరంగా పరిగణిస్తూ రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలు పేరుతో కొత్త సెక్షన్‌ను ప్రవేశపెడుతున్నాయని షా చెప్పారు.
ఈ మూడు బిల్లుల ముసాయిదాపై సమగ్రంగా చర్చించన అనంతరమే సభ అనుమతి కోసం ప్రవేశపెట్టామని అమిత్ షా స్పష్టం చేశారు.
కాగా, ప్రతిపాదిత కొత్త నేర చట్టాలు పోలీసు జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే వ్యవస్థను తీసుకువస్తాయని అమిత్ షా తెలిపారు. అరెస్టయిన వ్యక్తుల వివరాలు ఇప్పుడు ప్రతి పోలీస్ స్టేషన్‌లో నమోదు చేస్తారని, దీని కోసం నియమించిన పోలీస్ అధికారి ఈ రికార్డుల బాధ్యత చూస్తారని తెలిపారు. మానవుల అక్రమ రవాణా చట్టాలను లింగ తటస్థం చేశామని వివరించారు.
ప్రస్తుత నేర చట్టాలు ఐపీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ) న్యాయం అందించేందుకు బదులు శిక్షించే ఉద్దేశంతో వలసవాద ధోరణికి అద్దం పడతాయని పేర్కొన్నారు. ఈ మూడు ప్రతిపాదిత బిల్లులతో భారత ఆలోచనధోరణికి అద్దం పట్టేలా న్యాయ వ్యవస్ధను నెలకొల్పేలా రూపొందాయని చెప్పారు.
ఈ మూడు ప్రతిపాదిత నేర చట్టాలు ప్రజలను వలసవాద ఆలోచన, దాని సంకేతాల నుంచి బయటపడేస్తాయని హోంమంత్రిస్పష్టం చేశారు. భారతీయ శిక్షాస్మృతి స్థానంలో కొత్తగా తీసుకువస్తున్న భారతీయ న్యాయ సంహిత శిక్ష కంటే న్యాయంపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు. వలస పాలన నాటిక్రిమినల్ చట్టాల స్ధానంలో తీసుకువచ్చిన మూడు బిల్లులు మానవ కోణంలో నేర న్యాయ వ్యవస్ధలో సమగ్ర మార్పులు తీసుకువస్తాయని పేర్కొంటూ పెనాల్టీల విధింపుతో సరిపెట్టకుండా నూతన బిల్లులతో న్యాయం జరుగుతుందని చెప్పారు.
సీఆర్‌పీసీలో 484 సెక్షన్లు ఉండగా కొత్త బిల్లులో 531 సెక్షన్లు చేర్చినట్లు చెప్పారు. 177 సెక్షన్లలో మార్పులు చేసి 9 సెక్షన్లు అదనంగా చేర్చామని తెలిపారు. 39 సబ్ సెక్షన్లు, 44 నూతన ప్రొవిజన్లు చేరాయని అమిత్ షా వివరించారు.
అయితే, బిల్లులపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. కొత్త బిల్లులు ఎవరిపై అయినా చర్యలు తీసుకునేలా అధికారాన్ని పోలీసులకు కల్పిస్తున్నాయని ధ్వజమెత్తారు. దాంతో ప్రజల పౌరహక్కులు, హక్కులకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లులు దేశంలోని సామాన్య ప్రజలకు వ్యతిరేకమని చెప్పారు.
More Stories
ఒకే దేశం- ఒకే ఎన్నిక జేపీసీ గడువు పొడిగింపు!
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది