షమీకి అర్జున, సాత్విక్‌-చిరాగ్ జోడీకి ఖేల్‌ రత్న

దేశంలో క్రీడాకారులకు అందజేసే జాతీయ క్రీడా అవార్డులను కేంద్రం ప్రకటించింది. 2023 ఏడాదికి గాను కేంద్ర యువజన సర్వీసులు, క్రీడల మంత్రిత్వ శాఖ బుధవారం ఈ అవార్డుల జాబితాను వెల్లడించింది. క్రీడాకారులకు అందజేసే అత్యున్నత పురస్కారమైన మేజర్‌ ధ్యాన్‌చంద్‌ ఖేల్‌ రత్న -2023 అవార్డు భారత బ్యాడ్మింటన్‌ ద్వయం చిరాగ్‌ చంద్రశేఖర్‌ శెట్టి – రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌లకు దక్కింది. 
 
భారత స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ షమీకి అర్జున అవార్డును ప్రకటించిన కేంద్రం అతడితో పాటు మరో 25 మంది ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన బాక్సర్‌ మహ్మద్‌ హుసాముద్దీన్‌ కూడా అర్జున అవార్డు పొందిన జాబితాలో ఉన్నాడు.

అర్జున గ్రహీతలు

అర్జున అవార్డు పొందినవారిలో ఆర్చరీ నుంచి ఇద్దరు (ఒజాస్‌ ప్రవీణ్‌, అదితి గోపీచంద్‌ స్వామి), అథ్లెటిక్స్‌ నుంచి (శ్రీశంకర్‌, పారుల్‌ చౌదరి), బాక్సింగ్‌ నుంచి (మహ్మద్‌ హుసాముద్దీన్‌), చెస్‌ క్రీడాకారిణి వైశాలి, ఈక్వెస్ట్రియన్‌ ప్లేయర్‌ దివ్యకృతి సింగ్‌, గోల్ఫ్‌ నుంచి దీక్షా దగర్‌లు ఉన్నారు. 

హాకీ క్రీడాకారులు కృష్ణ బహదూర్‌, సుశీలా చానులు, కబడ్డీ ప్లేయర్స్‌ పవన్‌ కుమార్‌, రితూ నేగీ, ఖో ఖో క్రీడాకరుడు నస్రీన్‌ కూడా అర్జున పొందారు. లాన్‌ బౌల్స్‌ నుంచి పింకి, షూటింగ్‌ క్రీడాకారులు ఐశ్వర్య ప్రతాప్‌ సింగ్‌ తోమర్‌,ఈశా సింగ్‌, స్క్వాష్‌ నుంచి హరిందర్‌ పాల్‌ సింగ్‌ సంధూ, టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి అహ్యిక ముఖర్జీ, రెజ్లింగ్‌ యోధులు అంతిమ్‌ పంగల్‌, నరోమ్‌ రోషిబినా దేవిలు కూడా అర్జున గ్రహీతలుగా ఉన్నారు.

 పారా అర్చరీ నుంచి శీతల్‌ దేవి, అంధుల క్రికెట్‌ నుంచి ఇల్లూరి అజయ్‌ కుమార్‌ రెడ్డి, పారా కనోయింగ్‌ ఆడుతున్న ప్రాచి యాదవ్‌లకు అర్జున దక్కాయి.

ద్రోణాచార్యులు వీళ్లే

లలిత్‌ కుమార్‌ – రెజ్లింగ్‌
ఆర్‌.బి. రమేశ్‌ – చెస్‌
మహవీర్‌ ప్రసాద్‌ సైని – పారా అథ్లెటిక్స్‌
శివేంద్ర సింగ్‌ – హాకీ
గణేష్‌ ప్రభాకర్‌ – మల్లఖంబ్‌

ద్రోణాచార్య అవార్డులలో అందజేసే లైఫ్‌ టైమ్‌ కేటగిరీ అవార్డులలో గోల్ఫ్‌ కోచ్‌ జస్క్రిత్‌ సింగ్‌ గ్రెవాల్‌, కబడ్డీ కోచ్‌ భాస్కరన్‌, టేబుల్‌ టెన్నిస్‌ కోచ్‌ జయంత కుమార్‌ పుషిలాల్‌ ఉన్నారు.

ధ్యాన్‌చంద్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్స్‌ అవార్డు..

మంజూష కన్వర్‌ – బ్యాడ్మింటన్‌
వినీత్‌ కుమార్‌ శర్మ – హాకీ
కవితా సెల్వరాజ్‌ – కబడ్డీ