కష్టపడింది బీజేపీ కానీ, లబ్ధి పొందింది కాంగ్రెస్

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కష్టపడింది బీజేపీ కానీ, లబ్ధి పొందింది కాంగ్రెస్ అని బిజెపి నేత, మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొంటూ కేసీఆర్ కు వ్యతిరేకంగా ఓటు వేయాలని బీజేపీ ప్రజలను చైతన్య పరిచిందని గుర్తు చేశారు.
 
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనేనని కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అణచివేత, నియంతృత్వ పోకడలతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని తెలిపారు. అయితే, ప్రజల పక్షాన పోరాటం చేసే నాయకుణ్ణి ఓడించాలని హుజూరాబాద్ నియోజకవర్గంలో అనేక కుట్రలు, విష ప్రచారం చేశారని తన ఓటమి గురించి ప్రస్తావిస్తూ ఆరోపించారు. 
 
అప్రమత్తంగా ఉండాల్సిన ప్రజలు బీఆర్ఎస్ చేసిన విష ప్రచారం ప్రజలు నమ్మారని విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తం కావాలని కోరారు. రాజకీయ ఎత్తుగడలు చేయడంతో పాటు ఎదుగుదల చూసి ఓర్వలేని వారు కూడా కుట్రలు చేసి ఉంటారని విమర్శించారు. తాను బలంగా ఎదుగుతున్నానని తన ఎదుగుదల అడ్డు కలుగుతుందని భావించిన వారు కూడా కుట్రలు చేశారని ఆరోపించారు. 
 
డైరెక్ట్ గా ఎదుర్కోలేక ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారని మండిపడ్డారు. ఏది ఏమైనా అన్ని గ్రహించుకుని భవిష్యత్ కోసం పని చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని, వాటిని గ్రహించి ధర్మం, న్యాయం గెలుపు కోసం పని చేయాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా, పార్టీ ఆదేశం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు.