తెలంగాణ మొత్తం అప్పులు రూ. 6,71,757 కోట్లు

* కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం.. కొట్టిపారేసిన బిఆర్ఎస్
 
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మొత్తం 42 పేజీలతో శ్వేతపత్రాన్ని బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర మొత్తం అప్పులు రూ.6,71,757 కోట్లుగా ఉందని తెలిపింది. తెలంగాణ ఏర్పడిన నాటికి రుణం రూ.72,658 కోట్లుగా ఉండగా, పదేళ్లలో సగటున 24.5 శాతం పెరిగాయని తెలిపింది. 
 
ప్రస్తుత రాష్ట్ర రుణం రూ.3లక్షల 89 వేల కోట్లుగా ఉందని వెల్లడించిన సర్కార్ ప్రభుత్వ కార్పొరేషన్లలో తీసుకున్న అప్పులు రూ.59 వేల 414 కోట్లుగా ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి, ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క సమర్పించిన పత్రంలో తెలిపారు. అయితే, ప్రభుత్వం అంకెల గారడీ చేసే ప్రయత్నం చేసిందే తప్ప, వాస్తవాలను చెప్పలేదని,  శ్వేతపత్రంలోని వివరాలు శుద్ధతప్పు అని మాజీ ఆర్ధికమంత్రి, బిఆర్ఎస్ నేత హరీష్ రావు  ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో గత పదేళ్లలో తెలంగాణ అప్పులు రూ.72,658 కోట్ల నుంచి రూ.6,71,757 కోట్లకు పెరిగినట్లు శ్వేతపత్రంలో పేర్కొంది ప్రభుత్వం. కాగ్ రిపోర్ట్‌లోని అంశాలను నివేదికలో పెట్టినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం బడ్జెట్‌ వ్యయంలో ఆరోగ్యంపై ఖర్చు 5 శాతం మాత్రమే చేసినట్లు వెల్లడించింది.  బడ్జెట్‌కు వాస్తవ వ్యయానికి 20 శాతం అంతరం ఉందన్న సర్కార్ పదేళ్లలో చేసిన ఖర్చుకు అనుగుణంగా ఆస్తుల సృష్టి జరగలేదని స్పష్టం చేసింది.

 పదేళ్లలో ఖర్చు చేసిన నిధులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించబడలేదని,  2014లో 100 రోజులకు సరిపడా బ్యాలెన్స్ ఉండేదని, అయితే ప్రస్తుత పరిస్థితి పది రోజులకు తగ్గిందని తెలిపింది.  2015-16లో రుణ, జీఎస్డీపీ 15.7 శాతంతో దేశంలోనే అత్యల్పం. అదే 2023- 24 నాటికి 27.8 శాతానికి పెరిగిన రుణ, జీఎస్డీపీ శాతమని వివరించింది.

రెవెన్యూ రాబడిలో మరో 35% ఉద్యోగుల జీతాలు పెన్షన్లకు వెళ్లడంతో దీంతో పేద వర్గాల సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక వెసులుబాటు తగ్గిందని భట్టి విక్రమార్క చెప్పారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు మొత్తం రూ. 97,449 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ. 79,287 కోట్లు విడుదలయ్యాయి. రూ. 74,950 కోట్లు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నది. 
కాగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చూస్తుంటే  రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండదని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తప్పుల అంకెలను ప్రస్తావిస్తూ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి నష్టమని చెప్పారు.