బిగ్‌బాస్-7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అరెస్ట్

బిగ్‌బాస్ -7 విజేత ప‌ల్ల‌వి ప్ర‌శాంత్ అరెస్టు అయ్యారు. గ‌జ్వేల్‌లో మండ‌లం కొల్గూరులో ప్ర‌శాంత్‌ను పోలీసులు బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం  హైదరాబాద్ తరలించిన తర్వాత ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారించారు.  రాత్రి పొద్దుపోయిన తర్వాత న్యాయమూర్తి నివాసంలో పల్లవి ప్రశాంత్‌తో పాటు అతడి సోదరుడిని హాజరుపరిచగా నిందితులకు న్యాయమూర్తి 14రోజుల రిమాండ్ విధించింది.

పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రామరాజులను పోలీసులు చంచల్‌ గూడ జైలుకు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేశారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. న్యాయస‌్థానం ఆదేశాలతో జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.  బిగ్‌బాస్‌ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్‌ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగ‌తి తెలిసిందే.

బిగ్‌బాస్‌ ఫ్యాన్స్‌ చేసిన విధ్వంసాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వారందరిపై కేసులు పెడుతున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు పల్లవి ప్రశాంత్‌ను కూడా వదిలిపెట్టలేదు.  పల్లవి ప్రశాంత్‌ను ఏ1గా, అతని తమ్ముడు మనోహర్‌ను ఏ2గా కేసు నమోదు చేశారు.

బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌ విజేతగా పల్లవి ప్రశాంత్‌ నిలిచాడనే వార్త ముందుగానే బయటకు పొక్కడంతో గత ఆదివారం సాయంత్రం చాలామంది ఫ్యాన్స్‌ అన్నపూర్ణ స్టూడియో వద్దకు వచ్చేశారు.  అదే సమయంలో అమర్‌దీప్‌ ఫ్యాన్స్‌ కూడా అక్కడకు చేరుకున్నారు.  ఈ సమయంలో పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ కొందరు రోడ్డుపై నానా హంగామా చేశారు. ఇతర కంటెస్టెంట్ల కార్లపై దాడికి దిగారు.

ఈ క్రమంలో అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్‌ ఫ్యాన్స్‌ రోడ్డుపైనే కొట్టుకున్నారు.  ఆర్టీసీ బస్సుల‌తో పాటు పోలీసుల వాహ‌నాల‌ను కూడా ధ్వంసం చేశారు. ఈ దాడులను ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సీరియస్‌గా తీసుకున్నారు.  ఆయన ఆదేశాలతో ఆర్టీసీ అధికారులు జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు చేసిన పోలీసులు అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్‌ అభిమానుల ప్రమేయం ఉందని గుర్తించారు. 

తాజాగా ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేశారు. విధ్వంసానికి సంబంధించిన వీడియోలు, సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా మరికొంతమంది ఆకతాయిలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అల్లర్ల సమయంలో ఆ ప్రాంతంలో ఉన్న మొబైల్ డంప్‌ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.