తెలంగాణాలో గిరిజన యూనివర్సిటీకి రాష్ట్రపతి ఆమోదం

దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తెలంగాణ గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించిన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదముద్ర వేయడంతో చట్టరూపాయం దాల్చింది. 
 
కేంద్ర విశ్వవిద్యాలయాల చట్టం-2009లో తెలంగాణలోని ములుగు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న సమ్మక్క-సారక్క కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం పేరును చేరుస్తూ విద్యాశాఖ ప్రవేశపెట్టింది. సవరణ బిల్లు లోక్‌బభలో డిసెంబర్ 7న, రాజ్యసభలో 13న ఆమోందం పొందింది. ఈ సమయంలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ  చేసిన ప్రకటనతో సుదీర్ఘ కాలంగా ఉన్న అపోహలకు తెరపడింది. 
 
ప్రధాని మోదీ ప్రకటన తర్వాత ఇటీవల పార్లమెంటులో కేంద్రం ఈ బిల్లును ప్రవేశపెట్టింది. ఇక ఏడేళ్లలో రెండు దశల్లో రూ.889.07 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఇటీవల పార్లమెంటులో కేంద్ర విద్యాశాఖ మంత్రి  ధర్మేంద్ర ప్రధాన వెల్లడించారు. ఈ ఖర్చు మొత్తాన్ని కేంద్ర విద్యాశాఖ బడ్జెట్ రూపంలో అందిస్తుందని వివరించారు.
 
గిరిజన యూనివర్సిటీ కోసం ములుగు సమీపంలోని గట్టమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో 335 ఎకరాల స్థలాన్ని కోసం సేకరించారు. భూ సేకరణ కోసం గిరిజన సంక్షేమశాఖ రూ.10 కోట్లను కేటాయించింది. పలుమార్లు హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించి, నిర్మాణానికి అనువుగానే ఉందని నిర్ధారించి సంతృప్తి వ్యక్తం చేశారు. 
 
గిరిజన కేంద్ర యూనివర్సిటీతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి చెందటమే కాకుండా, విద్యావకాశాలు మరింత మెరుగుపడతాయని గిరిజన, ఆదివాసీ సంఘాలు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.