అయోధ్యకు తెలంగాణ నుంచి 17 రైళ్ళు

వచ్చే ఏడాది జనవరి 22న అయోధ్యలో ప్రతిష్టాత్మక రామమందిర ప్రాణ ప్రతిష్ట జరగనున్న సంగతి తెలిసిందే. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్లే కేంద్రం కూడా అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లను నడిపేలా ఇప్పటికే కార్యచరణ రూపొందించింది.

కాగా తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్లే భక్తజనం కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని కనులారా వీక్షించేందుకు తెలంగాణ నుంచి 17 రైళ్లను అయోధ్యకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనుంది కమలం పార్టీ. తెలంగాణ లో మొత్తం 17 పార్లమెంట్ నియోజకవర్గాలుండగా.. ప్రతీ నియోజకవర్గం నుంచి ఒక్కో ట్రైన్ పంపేలా బీజేపీ రూపకల్పన చేసింది.

వరుసగా 17 రోజుల పాటు 17 నియోజకవర్గాల నుంచి అయోధ్యకు రైళ్లు నడిచే ఏర్పాట్లు చేయనుంది. ఈ కార్యక్రమం కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రత్యేకంగా రెండు కమిటీలు వేయనున్నారు. ఒక కమిటీ తెలంగాణ లో ఆర్గనైజ్ చేయనుండగా.. మరో కమిటీ మాత్రం ఇక్కడి నుంచి ట్రైన్ లో అయోధ్యకు వెళ్లినవారి కోసం అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయనుంది.

కాగా అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ట వేడుకను నభూతో నభవిష్యత్ అనేలా ఏర్పాట్లు చేస్తోంది రామ జన్మభూమి ట్రస్ట్. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు జనవరి 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్న ఈ కార్యక్రమానికి బౌద్ధుల మత గురువు దలైలామా నుంచి పారిశ్రామికవేత్త అదానీ దాకా పలువురు ప్రముఖులను ట్రస్ట్ నిర్వాహకులు ఇప్పటికే ఆహ్వానించారు.