గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన

రెండు నెలలకు పైగా కొనసాగుతున్న హమాస్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం ఇప్పుడే ముగిసేలా కనిపించడం లేదు. దానితో గాజాలో పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇజ్రాయెల్‌ నిర్వహిస్తున్న తనిఖీలతో యుద్ధంలో గాయపడ్డ రోగికి సకాలంలో చికిత్స అందకపోవడంతో మృతి చెందాడని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రేయేసస్‌ ఆరోపించారు. 

ఆరోగ్య కార్యకర్తలను నిర్బంధించడంతో పాటు సహాయక ట్రక్కులపై దాడి చేస్తూ గాజాలో ఆరోగ్య, రెస్క్యూ మిషన్లకు ఇజ్రాయెల్‌ అంతరాయం కలిగించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో ఆ రోగిని మృతి చెందాడని తెలిపారు.  అల్-అహ్లీ హాస్పిటల్ నుంచి శనివారం గాజాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ మిషన్‌కు తమకు సమాచారం వచ్చిందని, ఆరోగ్య కార్యకర్తలు చాలాకాలం పాటు నిర్బంధించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇలాంటి చర్యలు రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడేస్తాయని ఆయన హెచ్చరించారు. పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీకి చెందిన కొందరు ఉద్యోగులను ఉత్తర గాజాకు వెళ్లి తిరిగి వచ్చే సమయంలో కూడా అదుపులోకి తీసుకున్నారని ఆయన ఆరోపించారు. వైద్య సామగ్రి, అంబులెన్స్‌తో కూడిన సహాయక ట్రక్‌పై కాల్పులు జరిగినట్లు చెప్పారు.

ఇదిలా ఉండగా.. అక్టోబర్‌ 7న మొదలైన యుద్ధంలో 18వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. సుమారు 19 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. హమాస్‌ దాడి తర్వాత ఇజ్రాయెల్‌ సైన్యం గాజాపై విరుచుకుపడుతున్నది.

కాల్పుల విరమణ ప్రసక్తే లేదు
 
ఇలా ఉండగా, హమాస్‌తో జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ పాటించాలన్న అంతర్జాతీయ సమాజం కోరికను ఇజ్రాయెల్‌ తోసిపుచ్చింది. యుద్ధాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ‘మేం చివరి వరకు కొనసాగిస్తాం. అందులో మరో ప్రశ్న లేదు. మమ్మల్ని ఏదీ ఆపలేదు’ అని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు తెలిపారు. 
షిజైయహ్‌ మిగతా ప్రాంతాల్లో కొన్ని రోజులుగా భారీగా యుద్ధం కొనసాగుతున్నది. వేలాది మంది గాజా తూర్పు ప్రాంతంలోనే ఉండిపోయారు. తాము ఇండ్లకు తిరిగి వెళ్లలేమేమోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.