ఇకపై ఇరాన్ కు వీసా అవసరమే లేదు

ఇకపై ఇరాన్‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు మరో 32 దేశాలకు పర్యాటకులు కూడా వీసా అవసరం లేకుండానే తమ దేశంలో పర్యటించవచ్చని తెలిపింది. 
ఇప్పటికే తుర్కియే, రిపబ్లిక్‌ ఆఫ్‌ అజర్‌బైజాన్‌, ఒమన్‌, చైనా, ఆర్మేనియా, లెబనాన్‌, సిరియా దేశాలకు వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చింది. తాజాగా మరో 33 దేశాలకు కూడా మినహాయింపు ఇవ్వడంతో ఆ సంఖ్య 45కు చేరింది.  ప్రస్తుతం భారత్‌ నుంచి దౌత్య వ్యవహారాల కోసం ఇరాన్‌ వెళ్లే వారికి మాత్రమే వీసా మినహాయింపు ఉండేది. 
 
కానీ తాజా నిర్ణయంతో పర్యాటకులు కూడా వీసా లేకుండానే ఇరాన్‌లో పర్యటించవచ్చు. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన పర్యాటకులను ఆకర్షించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ పర్యాటక శాఖ మంత్రి ఎజ్జటొల్లా జర్ఘామీ వెల్లడించారు. దీనివల్ల తమ దేశంలోని పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
నిజానికి ఇరాన్‌ ప్రభుత్వం ఇస్తున్న వీసా నిబంధనల సడలింపు సత్ఫలితాలను ఇస్తున్నాయని ఇరాన్‌ అధికారిక వార్తా సంస్థ ఐర్నా  వెల్లడించింది. ఇరానియన్‌ సంవత్సరం మొదలైనప్పటి నుంచి 8 నెలల కాలంలో 44 లక్షల మంది పర్యాటకులు తమ దేశంలో పర్యటించారని పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఇది 48.5 శాతం ఎక్కువ కావడం విశేషం.ఇరాన్ నుండి వీసా మినహాయింపు పొందిన దేశాలు: రష్యా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), బహ్రెయిన్‌, సౌదీ అరేబియా, ఖతర్‌, కువైట్‌, లెబనాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, తజికిస్థాన్‌, తునీసియా, మారిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్‌, సీషెల్స్‌, ఇండోనేసియా, బ్రునెయి, జపాన్‌, సింగపూర్‌, కాంబోడియా, మలేసియా, వియాత్నం, బ్రెజిల్‌, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా, హెర్జెగోవినా, సెర్బియా, క్రోషియా, బెలారస్‌

ఇక భారత్‌ విషయానికొస్తే కెన్యా, ఇండోనేసియా, మలేసియా, థాయిలాండ్‌, శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, హైతీ, మాల్దీవ్స్‌, మారిషస్‌ సహా 27 దేశాల్లో భారతీయులు వీసా లేకుండానే పర్యటించవచ్చు.