ఆర్టికల్ 370 రద్దుపై `సుప్రీం’ తీర్పుతో విషం కక్కిన చైనా

ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో మరోసారి భారత్‌పై చైనా, పాకిస్తాన్ లు విషం కక్కాయి. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగ బద్ధమేనని పేర్కొన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం  దీనిపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైందేనని స్పష్టం చేసింది. 

అయితే ఈ సుప్రీం కోర్టు తీర్పుపై చైనా నోరు పారేసుకుంది. దీనికితోడు లఢఖ్‌ను భారత్ అక్రమంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆరోపించారు. పైగా లఢఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా భారత్ ఏర్పాటు చేయడాన్ని చైనా గుర్తించడం లేదంటూ విద్వేషపూరిత వాఖ్యలు చేశారు. పైగా, ఈ తీర్పును కాశ్మీర్ సంఘర్షణగా అభివర్ణించారు.

తాజాగా ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పును ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించిన మావో నింగ్  భారత్‌ చైనా సరిహద్దు పశ్చిమ భాగ వాస్తవ స్థితిని మార్చలేదని, లఢఖ్‌ ప్రాంతం ఎప్పటికీ తమ భూభాగమే అంటూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెరతీశారు. అంతకుముందు కూడా ఇదే విషయంపై స్పందించిన చైనా పాక్ చేసిన వాదనకు మద్దతుగా మాట్లాడటం గమనార్హం. భారత్ విషయంలో గానీ, భారత్‌తో సరిహద్దుల విషయంలో గానీ పాకిస్థాన్, చైనాలో ఒకే రకమైన వైఖరి తీసుకోవడం తెలిసిందే.
2019 ఆగస్టు 5 వ తేదీన భారత్‌ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను అంతర్జాతీయ చట్టం గుర్తించలేదని పేర్కొంటూ ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు అంతర్జాతీయంగా చట్టపరమైన విలువ లేదని పాకిస్థాన్ వివాదం రాజేసే ప్రయత్నం చేసింది. ఆ వ్యాఖ్యలను సమర్థించిన చైనా మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది.
భారత్‌ – పాక్‌ల మధ్య ఎంతో కాలంగా జమ్మూ కాశ్మీర్ వివాదం కొనసాగుతోందని పేర్కొంది. రెండు దేశాలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానాలు, ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం శాంతి మార్గంలో చర్చల ద్వారా జమ్మూ కాశ్మీర్‌ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది.