కేసీఆర్, మాజీ మంత్రులకు భద్రత కుదింపు

బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్‌కు భద్రత కుదిస్తున్నట్టు రాష్ట్ర పోలీసుశాఖ తెలిపింది. కేటీఆర్‌, హరీశ్‌రావు సహా గెలిచిన మాజీ మంత్రులకు ఎమ్మెల్యేలకు కేటాయించే భద్రతనే ఇచ్చినట్టు తెలిసింది. మాజీ సీఎం, క్యాబినెట్‌ ర్యాంకు కలిగిన ప్రతిపక్ష నేతగా కేసీఆర్‌కు ప్రస్తుతం ‘వై’ క్యాటగిరీ భద్రతను కేటాయించినట్టు సమాచారం.
 
ఆయన వెంట నిత్యం నలుగురు భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్‌, పైలట్‌ వాహనాలు ఉంటాయి. పదేండ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ‘నోన్‌ సోర్స్‌’ నుంచి లేదా ‘అన్‌నోన్‌ సోర్స్‌’ నుంచి ప్రమాదం పొంచి ఉం డొచ్చు. కేసీఆర్‌ భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  కేసీఆర్‌ ఇంటి ముందు ఓ సెంట్రీతో పా టు మరో ఇద్దరిని భద్రతగా ఉంచే అవకాశం ఉన్నది.
మావోయిస్టులు గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా, నేటి కీ పోస్టర్లు విడుదల చేస్తున్నా భద్రతను తగ్గించటం అనుమానాలను రేకెత్తిస్తున్నది.  థ్రెట్‌ పర్సప్షన్‌ రేట్‌(టీపీఆర్‌)కు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మాజీ మంత్రులకు కూడా 2+2 భద్రతను కొనసాగిస్తారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యేలందరికీ భద్రతను పూర్తిగా తీసివేశారు. 
 
ఇటీవల ప్రజాప్రతినిధుల భద్రతపై ఇంటెలిజెన్స్‌శాఖ సమీక్ష నిర్వహించి.. మాజీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ప్రాణహాని, ఇతరుల నుంచి ముప్పుగానీ లేదని అం చనాకు వచ్చి వారి భద్రత తొలగించింది. ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌ నుంచి గన్‌మెన్‌లను రీకాల్‌ చేశారు.
 
యశోదా ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జి
 
కాగా, యశోదా ఆస్పత్రి నుంచి  కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. డిసెంబర్ 8వ తేదీ అర్థరాత్రి సమయంలో ఫామ్‌హౌస్‌లో కాలు జారి పడటంతో కేసీఆర్ గాయపడ్డారు. అర్థరాత్రి సమయంలో కేసీఆర్ గాయపడిన వెంటనే హుటాహుటిన సోమాజిగూడ యశోదా ఆస్పత్రికి తరలించారు. ఎడమ కాలు తుంటి ఎముక విరగడంతో తుంటి మార్పిడి సర్జరీ నిర్వహించారు. 
 
గత వారం రోజులుగా యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత డిశ్చార్జి చేశారు. కేసీఆర్ నంది నగర్‌లో ఉన్ననివాసానికి వెళ్లారు. మ‌రో నాలుగైదు వారాల పాటు కేసీఆర్ విశ్రాంతి తీసుకోవాల‌ని వైద్యులు సూచించారు. పూర్తి స్థాయిలో కోలుకోడానికి ఆరు నుంచి ఎనిమిది వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.