హైదరాబాద్ ఫార్మాసిటీ రద్దు.. ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

హైదరాబాద్ నగర శివారు కందుకూరు, కడ్తాళ్, యాచారం తదితర గ్రామాల పరిధిలో సుమారు 20 వేల ఎకరాల్లో నిర్మించ తలపెట్టిన ఫార్మాసిటీని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయటంతో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఫార్మాసిటీని ప్రతిపాదిత ప్రాంతంలో కాకుండా నగరానికి మరింత దూరంగా నిర్మిస్తామని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించింది. దీంతో.. ఇప్పటి వరకు భూములు కోల్పోయిన రైతులు, స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఫార్మా రంగ కంపెనీల యజమానులు మాత్రం పెదవి విరుస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మరింత విస్తరిస్తున్న నేపథ్యంలో.. ఫార్మాసిటీ లాంటి మెగా ప్రాజెక్టును నగరానికి దూరంగా ఉండటమే మంచిదని పర్యావరణ నిపుణులు సైతం అభిప్రాయ పడుతున్నారు. అయితే.. ఇప్పటికే దీనిపై గత ప్రభుత్వం ఖర్చు చేసిన సుమారు 2 వేల కోట్ల రూపాయల సొమ్ము మాటేంటని..? మరి కొంత మంది ప్రశ్నిస్తున్నారు.

భాగ్యనగరం ఇప్పటికే ఫార్మా రంగానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉంది. షామీర్ పేట్‌లోని జీనోమ్ వ్యాలీ కేంద్రంగా అనేక కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సుమారు 19 వేల 333 ఎకరాల్లో, 64 వేల కోట్ల పెట్టుబడులతో ఫార్మా సిటీ నిర్మాణానికి గత ప్రభుత్వం ప్లాన్ చేసింది. సుమారు 5.6 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. దీనికై కందుకూరు పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల నుంచి భూ సేకరణ మొదలు పెట్టింది. అక్కడ ఇప్పటికే 9 వేల 133 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా.. మరో 10 వేల 200 ఎకరాలను రైతుల నుంచి సేకరించేందుకు రంగం సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే రైతుల నుంచి సుమారు 4 వేల ఎకరాలను తీసేసుకుంది. ఎకరం కోటి నుంచి 3 కోట్ల రూపాయలు పలికే భూములకు కేవలం 16 లక్షల రూపాయలను మాత్రమే ఇవ్వటంతో.. అనేక మంది కోర్టుకు ఎక్కారు. దీనిపై పలు కోర్టుల్లో వివాదాలు కూడా నడుస్తున్నాయి. నిబంధనల ప్రకారమే భూములు తీసుకోవాలని, పరిహారం చెల్లించాలని హైకోర్టు సైతం తీర్పు చెప్పింది.

ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి సేకరించిన భూమిని కలిపితే సుమారు 13 వేల ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. ప్రతిపాదిత ఫార్మాసిటీకి కిలో మీటర్ వరకు బఫర్ జోన్‌గా ప్రకటించిన తెలంగాణ గత ప్రభుత్వం.. నిర్మాణాలపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. దీంతో.. ఫార్మా సిటీ వస్తుందని భూములు కొన్నవారు సైతం నిర్మాణాలు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఆయా ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ రంగం కూడా కుప్పకూలింది. ఇలా.. ఫార్మా సిటీ చుట్టూ అనేక వాదాలు, వివాదాలు ముసురుకున్నాయి. తమ గ్రామాలు కాలుష్య కాసారాలుగా మారతాయంటే స్థానికులు సైతం పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఆనాడు ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీ తరలింపునకు హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఫార్మాసిటీ రద్దు ప్రకటన వెలువడింది.

అయితే ఫార్మాసిటీకి బదులుగా అక్కడ మెగా టౌన్ షిప్ కడతామని రేవంత్ రెడ్డి సర్కార్ చెబుతుంది. ప్రభుత్వ భూములు 9 వేల 133 ఎకరాలు అందుబాటులో ఉన్న నేపథ్యంలో.. రైతుల నుంచి సేకరించిన సుమారు 4 వేల భూములను తిరిగి ఇచ్చేసే అవకాశం ఉంది. మొత్తం మీద హైదరాబాద్ నగర శివార్లలో ఫార్మాసిటీ నిర్మాణం కథ కంచికి చేరటంతో.. దాని చుట్టూ అల్లుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం సందిగ్దంలో పడిందనే చెప్పవచ్చు.