తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలకు ఈసీ అనుమతి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. జూన్​ 2న సికింద్రాబాద్​ పరేడ్​ గ్రౌండ్స్​లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగనున్నాయి. గన్​పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్​ రెడ్డి నివాళి అర్పించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణపై సీఎస్​ శాంతికుమారి సమీక్ష నిర్వహించారు. అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని వివిధ శాఖలకు సీఎస్​ ఆదేశాలు ఇచ్చారు.

పరేడ్​ గ్రౌండ్స్​ వద్ద రోడ్డుకు రెండు వైపులా రంగు రంగుల జెండాలతో అలంకరించాలని జీహెచ్​ఎంసీకి సీఎస్​ తెలిపారు. సభ ప్రాంగణం పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, భద్రత, పార్కింగ్​, షామియానాలు, బారికేడింగ్​, ఆటంకం లేకుండా త్రీఫేజ్​ విద్యుత్​ సరఫరా ఏర్పాట్లు చేయాలని సీఎస్​ ఆదేశించారు. 

పండగ వాతావరణాన్ని తలపించేలా కళాకారులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని సాంస్కృతిక శాఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఈ సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక సీఎస్​ అధర్​ సిన్హా, ముఖ్యకార్యదర్శులు బి.వెంకటేశం, జితేందర్​ తదితరులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఉత్సవాలకు తగు సన్నాహాలు చేశారు. జూన్​ 2తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తవుతుందని, రాష్ట్ర అధికార గీతంగా జయ జయహే తెలంగాణకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈ గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఆలపించనున్నారు. ఈ గేయం ఉద్యమం సమయంలో విస్తృత ప్రాచుర్యం పొందింది. అందరిలోనూ స్ఫూర్తిని నింపింది. ప్రస్తుతం ఈ గేయం నిడివి సుమారు రెండు నిమిషాలకు కుదించడంతో పాటు కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

అలాగే సవరించిన అధికార చిహ్నం, తెలంగాణ తల్లి రూపాన్ని కూడా ఆవిష్కరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ విషయంపై కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. జూన్​ 2న ఆవిష్కరించాలనే భావన ప్రభుత్వంలో ఉంది. రాష్ట్ర అవతరణ వేడుకలకు ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానించి సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఉద్యమకారులను సన్మానించనున్నారు. సన్నానం చేయాల్సిన ఉద్యమకారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆరు గ్యారంటీల్లో మరొకటి లేదా మరేదైనా కొత్త పథకం లేదా పాలసీని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.  టీఎస్​ పేరును టీజీగా ప్రభుత్వం మార్చింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన బోర్డులు, వెబ్​సైట్​లన్నీ పూర్తిగా మారుస్తోంది. జిల్లా, మండలం, పంచాయతీల్లోనూ అవతరణ వేడుకలు జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు.