శబరిమలలో తెలంగాణ భవన్ .. రాజాసింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లిన లక్షలాది మంది భక్తులు, సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన అయ్యప్పస్వాములకు అన్నప్రసాదం చేద్దామన్నా కేరళ ప్రభుత్వం అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తాగునీరు, పార్కింగ్ సదుపాయం లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని రాజా సింగ్ తెలిపారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం రేవంత్ రెడ్డికి మంచి సంబంధాలున్నాయని పేర్కొంటూ కేరళ సీఎంతో మాట్లాడి భోజన, వసతి, తాగునీటి సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే రాజా సింగ్ విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీ తరహాలో కేరళలో కూడా ఐదు నుంచి పదిహేను ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ భవన్ ఏర్పాటు చేయాలని రాజాసింగ్ తెలంగాణ సర్కారును కోరారు.
తెలంగాణ భవన్ నిర్మిస్తే అక్కడ అయ్యప్ప స్వాములు బస చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. తెలంగాణ నుంచి వెళ్లిన స్వాములకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రాజాసింగ్ రేవంత్ సర్కారును కోరారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి దేశ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కేరళలోని విజయన్ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. చాలా మంది భక్తులు అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.  కేరళ ప్రభుత్వం భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కనీసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వాలైన తమ రాష్ట్రాలకు చెందిన భక్తుల కోసం తాగునీరు, బస, భోజనం కోసం ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

 
కాగా, కాంగ్రెస్ ఆరు గ్యారెంటిలతో అధికారంలోకి వచ్చిందని రాజాసింగ్ గుర్తు చేశారు. రాష్ట్రాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారని చెబుతూ ఇచ్చిన గ్యారెoటీలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అమలు చేస్తుందని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలకు నిధులు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారా? లేక ఇటలీ నుంచి తెస్తారా…? అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని పేర్కొంటూ ఆ పార్టీపై తమ యుద్ధం మొదలైందని రాజసింగ్ స్పష్టం చేశారు.