మెట్రోరైల్, ధరణి, ఫార్మాసిటీ.. తెలంగాణ ప్రభుత్వ కొత్త పాలసీ ఇదే..!!

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలపై.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో, ధరణి వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు విస్తరణ చేపట్టిన మెట్రో ప్రాజెక్ట్ ను కొంత కాలం నిలిపివేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా.. పాతబస్తీలో పెండింగ్ లో ఉన్న మెట్రోను పునరుద్దరించడంతో పాటే.. అక్కడి నుంచి ఎయిర్ పోర్ట్ కు మెట్రో విస్తరణ చేపట్టాలని ప్రతిపాదించారు.
తెలంగాణ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో.. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయదుర్గం-శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో విస్తరణకు బ్రేక్ పడినట్టుగానే భావిస్తున్నారు. హైదరాబాద్ మెట్రోపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం.. ఎయిర్ పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ఆరా తీశారు. ORR వెంట “త్రిబుల్ వన్” ప్రాంతంలో మెట్రో ఎలైన్ మెంట్‌ను రూపొందించడంపై అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికే ORR ఉన్న నేపథ్యంలో రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు హడావుడిగా మెట్రో నిర్మించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన టెండర్ ప్రక్రియను నిలిపి వేయాలని ఆదేశించారు.  దానికి ప్రత్యామ్నాయంగా MGBS – ఫలక్ నుమా, చాంద్రాయణ గుట్ట, ఎయిర్ పోర్టు వరుకు ఎలైన్‌మెంట్ రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఇందుకు గాను రెండు మార్గాలను సూచించారు. దీని ద్వారా రాజధానిలో అధిక జనాభాకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అంతేకాకుండా.. MGBS నుంచి ఫలక్ నుమా వరకు 5.5 కిలోమీటర్ల మేర ఓల్డ్ సిటీ‌లో మెట్రో లైన్ పూర్తి కాకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై విచారణ చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
 మరోవైపు కందుకూరు సమీపంలో నిర్మించతలపెట్టి ఫార్మాసిటీ కూడా నగరానికి దూరంగా ఏర్పాటు చేయాలని.. అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇప్పటికే సేకరించిన భూముల్లో మెగా టౌన్ షిప్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలని స్పష్టం చేశారు. నగరం విస్తరిస్తున్న దృష్ట్యా.. ఓఆర్‌ఆర్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వివరించారు.
ఇక.. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ ను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్.. అందుకు తగ్గ చర్యలకు సిద్ధమైంది. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం సూచించడం, మార్గదర్శకాలను ప్రతిపాదించేందకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. భూ సంబంధిత వివాదాలకు శాశ్వత పరిష్కారం లభించే విధంగా ఈ కమిటీ ప్రతిపాదనలను సూచించాలన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి.. భూ పరిపాలన ముఖ్య కమిషనర్ నవీన్ మిట్టల్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ధరణి పోర్టల్ కు బాధ్యులెవరు..? దీన్ని నిర్వహిస్తున్న కంపెనీ ఏది..? భూములకు సంబంధించిన రికార్డులున్నాయా..? భూముల డాటాకు నష్టం జరిగితే బాధ్యత ఎవరిది..? ధరణి లావాదేవీల ద్వారా సమకూరిన ఆదాయం ఎక్కడ జమ అవుతుంది..? అంటూ నవీన్ మిట్టల్ ను ప్రశ్నించారు.
మొత్తం మీద.. మెట్రోరైల్, ఫార్మాసిటీ, ధరణి పోర్టల్ నిర్వహణపై దృష్టి పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. వాటిలో సమూల ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. వీటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయనేది తెలియాలంటే.. మరి కొంత కాలం వేచి చూడాల్సిందే..!!