తెలంగాణ స్పీకర్‌‌‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

తెలంగాణ శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్‌ కుమార్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. స్పీకర్‌ ఎన్నికకు సభ్యులెవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది. శాసన సభ గురువారం ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఓవైసీ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. 
 
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కల్వకుంట్ల తారకరామారావుతో పాటు అన్ని పార్టీలకు చెందిన సభ్యులు స్పీకర్‌గా నియామకమైన గడ్డం ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రసాద్‌తో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు. 
 
అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ స్పీకర్‌ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు ధన్యవాదాలు తెలిపారు. సభ మంచి సాంప్రదాయానికి నాంది పలికిందని, సభ సమన్వయంతో అందరి సహకారంతో నిర్వహించాలని కోరారు.  స్పీకర్‌ పదవికి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ పేరును దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు ప్రతిపాదించిన వెంటనే మరో ఆలోచన లేకుండా కేసీఆర్‌ సహకరించాలని ఆదేశించారని చెప్పారు. 
 
భవష్యత్‌లోనూ ఇదే సంప్రదాయానికి కొనిసాగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సభ ద్వారా నెరవేరుద్దామని పిలుపునిచ్చారు. సమాజంలోని రుగ్మతలను శాసన సభ ద్వారా పరిష్కరిద్దామని చెప్పారు.  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి గడ్డం ప్రసాద్‌ కుమార్ స్పీకర్ బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.

వికారా బాద్‌ నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్‌ కుమార్‌ మూడో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, చిన్న వయసులో తండ్రిని కోల్పోయినా, ఎనిమిది మంది సోదరిమణులతో కలిసి కుటుంబాన్ని సమన్వయంగా చేసుకుంటూ తోడబుట్టిన వారిని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు.

ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉన్నారని చెప్పారు. గడ్డం ప్రసాద్‌ కుమార్‌ వంటి వ్యక్తులు సునిశిత దృష్టితో, సభను వారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నడిపించాలని కోరారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన తీరు అభినందనీయమని తెలిపారు. సభలో సభ్యుల హక్కులను కాపాడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమై 2008 ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచి 2009లో రెండోసారి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. హ్యాండ్‌లూమ్స్‌ వీవర్స్‌ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు వికారాబాద్‌ పట్టణానికి రూ. 2200కోట్లను జైపాల్ రెడ్డి ద్వారా మంజూరు చేయించారన్నారు. వికారాబాద్‌లో మెడికల్ కాలేజీ కావాలని ప్రతిపాదించారని, అక్కడ మెడికల్ కాలేజీల మంజూరైందని తెలిపారు.