అసెంబ్లీలో బిజెపి ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం

ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ముందు ప్రమాణ స్వీకారానికి నిరాకరించడంతో తెలంగాణ అసెంబ్లీలో రాజా సింగ్, కొత్తగా ఎన్నికైన మరో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు గురువారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎదుట ప్రమాణం చేశారు. స్పీకర్‌గా ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికైన వెంటనే బీజేపీ ఎమ్మెల్యేలు సభకు హాజరై ప్రమాణం చేశారు.

ప్రొటెం స్పీకర్‌గా ఏఐఎంఐఎం ఎమ్మెల్యే ఒవైసీని నియమించడాన్ని నిరసిస్తూ రాజా సింగ్‌తో పాటు మరో ఏడుగురు తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు డిసెంబర్ 9న సభా కార్యక్రమాలను బహిష్కరించారు. ఒవైసీ కంటే సీనియర్‌ సభ్యులు ఉన్నందున నిబంధనలను ఉల్లంఘించి ప్రొటెం స్పీకర్‌గా నియమించారని బిజెపి ఆరోపించింది.

ఆయన నియామకంపై బిజెపి గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్‌కు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల ముసుగులో కొన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టడానికి ఉద్దేశపూర్వకంగా నిబంధనలను ఉల్లంఘించిందని ఒక మెమోరాండంలో ఆరోపించింది. ప్రొటెం స్పీకర్‌గా ఒవైసీ నామినేషన్‌ను పక్కన పెట్టాలని, కొత్తగా ఏర్పాటైన అసెంబ్లీకి పూర్తిస్థాయి స్పీకర్‌ను ఎన్నుకునే ప్రక్రియను నిలిపివేయాలని గవర్నర్‌ను కోరింది.

 కాగా, స్పీకర్‌ ఎన్నికకు ముందు గురువారం సభ ప్రారంభమైన వెంటనే బిఆర్‌ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్‌ రెడ్డి, టి.పద్మారావు, పల్లారాజేశ్వరరావు సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌ అసదుద్దీన్ ఒవైసీ వారితో ప్రమాణం చేయించారు.