కాచిగూడ – బెంగళూరు వందే భారత్ సూపర్ హిట్

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైల్ సర్వీసులు సక్సెస్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 27 వందేభారత్ రైళ్లను కేంద్రం ప్రవేశపెట్టింది. కాచిగూడ సహా దేశవ్యాప్తంగా నడుస్తున్న వందేభారత్ రైళ్లను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించడంతో పాటు విస్తృత ప్రచారం చేశారు. సాధారణ ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోలిస్తే టికెట్ చార్జీలు మూడు నాలుగు రెట్లు ఎక్కువున్నా సరే ఒక్కసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు ప్రయాణికులు. తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుస్తూ ప్రయాణికులు ఆదరణను చూరగొంటున్నది.
ఇక కాచిగూడ నుంచి బెంగళూరులోని యశ్వంతపుర వరకు వెళ్లే వందేభారత్ కు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. వేలాది మంది ప్రయాణికులు ఈ సర్వీసును వినియోగించుకుంటున్నారు. కాచిగూడ నుంచి బెంగళూరు లేదా బెంగళూరు నుంచి కాచిగూడ రావాలన్నా సుదీర్ఘ వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తుండడమే ఇందుకు నిదర్శనం. బుధవారం మినహా ప్రతిరోజు ఉదయం 5.30 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.45 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది. తిరిగి బెంగళూరు నుంచి 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.20 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది.
కాచిగూడ నుంచి బెంగళూరు మీదుగా మైసూరుకు వెళ్లే ఎక్స్ ప్రెస్ రైలు లో మొత్తం 8 బోగీలు ఉంటాయి. ఇందులో ఒకటి ఎగ్జిక్యూటివ్ కాగా.. మిగతా ఏడు నాన్ ఎగ్జిక్యూటివ్ బోగీలు. నగరంలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అధికంగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలులో బెంగళూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. కాచిగూడ నుంచి నేరుగా బెంగళూరుకు.. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చే ప్రయాణికులే ఎక్కువగా ఉంటున్నారని.. మార్గ మధ్యంలో ఆగే స్టేషన్లలో దిగేవారు చాలా తక్కువని అధికారులు పేర్కొన్నారు.