పేదల పెద్దాసుపత్రికి పూర్వవైభవం వచ్చేనా..?

ఉస్మానియా ఆసుపత్రికి పూర్వవైభవం తెస్తామని ఎన్నికలకు ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో ఉస్మానియా ఆసుపత్రికి పూర్వవైభవంపై ఆశలు చిగురిస్తున్నాయి. చాలా కాలం నుంచి ఉస్మానియా ఆసుపత్రిలో ట్విన్ టవర్న్ నిర్మించాలని, పడకలను పెంచాలనే ప్రతిపాదనలున్నాయి. గత ప్రభుత్వం ఉస్మానియా ఆసుపత్రి రూపురేఖలు మారుస్తామని చెప్పింది. కానీ పనులు మాత్రం ముందుకు సాగలేదు.

ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ప్రస్తుతం మూడు భవనాలు ఉన్నాయి. పాతభవనం శిథిలం కావడంతో దానికి తాళం వేశారు. అక్కడి పడకలను కులీకుతుబ్‌షా, ఓపీ భవనానికి తరలించారు. దాదాపు 450 వరకు పడకలు ఉండగా అందులో సగం లోపు మాత్రమే పడకలను ఇతర వార్డులకు తరలించగలిగారు. కులీకుతుబ్‌ షా భవనంపై షెడ్డు వేసి కొన్ని పడకలను ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ సదుపాయాలు లేవు.

హెరిటేజ్‌ నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఇక్కడ మూడు భవనాలను నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు మ్యాప్‌ కూడా సిద్ధమైంది. ఐదు ఎకరాల స్థలంలో రెండు కొత్తభవనాలను నిర్మించడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మూడేళ్లలో వీటిని నిర్మించి రోగుల సేవలకు అందించాలని ఆదేశించింది. ఆరేళ్లు గడిచినా కొత్త భవనాల ఊసే లేదు. కనీసం కొత్త ప్రభుత్వమైనా నూతన భవనాలు నిర్మించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.