గాలిపటం పార్టీ.. గాలి వాటం నైజం.. ఇదీ ఎంఐఎం నిజస్వరూపం..!!

గాలి ఎటువీస్తే గాలిపటం అటు ఎగురుతుందనేది ఎంత సత్యమో.. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ మజ్లీస్ అంటకాగుతుందనేదీ అంతే నిజం. ఈ విషయం మరోసారి వాస్తవరూపం దాల్చింది. కళ్లముందు సాక్షాత్కారం అయ్యింది. తాజాగా కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు దారుస్సలాం చేయి చాస్తోంది. హస్తం పార్టీతో ములాఖత్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. అవకాశవాద రాజకీయాలకు మళ్లీ తెరతీసింది. మంగళవారం (డిసెంబర్-12) సీఎం రేవంత్ రెడ్డితో మజ్లీస్ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అఫ్ కోర్స్.. ఆ మీటింగ్ కేవలం పాతబస్తీని ఎలా అభివృద్ధి చేయాలనే అంతర్మథనంగా చెప్పుకుంటున్నా.. అంతర్గతంగా జరిగేది మాత్రం రెండు పార్టీల మధ్య సయోధ్య కోసమే అన్నది వేరే చెప్పక్కర్లేదు.
ఏ పార్టీ అనే సంబంధం లేదు. నీతి, నైతిక విలువలన్న టాపిక్కే ఉండదు. మొన్నటివరకు అంటే దాదాపు పదేళ్ల దాకా బీఆర్ఎస్ తో పొత్తు రాజకీయాలు నెరపిన ఎంఐఎం.. తాజాగా ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్‌తో దగ్గరయ్యేందుకు పావులు కదుపుతోంది. ఎన్నికలకు ముందు డైరెక్ట్ గా రేవంత్ రెడ్డిపై మాటలతూటాలతో అటాక్ చేసిన ఒవైసీ బ్రదర్స్.. ఇప్పుడా పార్టీ అధికారంలోకి రావడంతో వారితో చేయి కలిపేందుకు సిద్ధమవుతున్నారు. తమ రాజకీయాలు పాతబస్తీ డెవలప్ మెంట్ కోసమని ప్రచారం చేసుకునే ఈ గాలి(వాటం)పటం నాయకులు.. అధికారం కోసం అర్రులు చాస్తున్నారు.
ఎన్ని కాలాలు మారినా.. ఎన్ని కొత్త ప్రభుత్వాలు కొలువుదీరినా.. పాతబస్తీ అభివృద్ధి అనేది ఎప్పటికీ సజీవంగా ఉండే అంశం. దానికెప్పటికీ ముగింపు అనేది ఉండదు. పదేళ్ల నుంచి బీఆర్ఎస్ తో రాజకీయాలు చేస్తున్నా.. ఓల్డ్ సిటీలో జరిగిన డెవలప్ మెంట్ కు లెక్కాపత్రం అంటూ ఉండదు. ఆ మధ్య మజ్లీస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. తెలంగాణలో 9 శాతం ఉన్న ముస్లీంల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏకంగా 2 వేల కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు గొప్పలు చెప్పారు. సెక్యులర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ సర్కార్ అని అసెంబ్లీలోనే పొగడ్తలతో ముంచెత్తారు. మరి ఆ 2 వేల కోట్లతో ముస్లీంలకు ఏం ఒరిగిందనేది.. సమాధానం లేని ప్రశ్న.
రాజకీయాలకు సంబంధం లేని ముస్లీంలను మతకోణంలో రెచ్చగొట్టడం, ఇతర మతాలపై ద్వేషాన్ని పెంచడం, అమాయకులను మతోన్మాదులుగా మార్చడం.. తద్వారా రాజకీయ ప్రయోజనాలు సిద్ధించుకోవడం.. ఇన్నాళ్లూ మజ్లీస్ చేసిన రాజకీయాలు ఇవే. కానీ.. చాలాకాలం తర్వాత మజ్లీస్ స్వార్థ రాజకీయాలను అర్థం చేసుకున్న సాధారణ ముస్లీం ఓటర్లు.. మొన్నటి ఎన్నికల్లో వారికి తగిన బుద్దిచెప్పారు. మజ్లీస్ కు కేవలం 2.22 శాతం ఓటింగ్ షేర్ వచ్చిందంటే ఓటర్ల నుంచి వ్యతిరేకత ఎంత ఉందో తెలుస్తుంది. చాలా కష్టంగా 7 స్థానాల్లో గట్టెక్కింది. చాంద్రాయణగుట్ట మినహా.. మిగతా ఆరు చోట్ల 2018 ఎన్నికల్లో వచ్చిన తక్కువ ఓటింగ్ నమోదుచేసుకుంది. అయినా మజ్లీస్ అధికారదాహానికి ఈ లెక్కలేవీ పట్టడం లేదు.
ఇక కాంగ్రెస్ కు కూడా ఎంఐఎం సపోర్ట్ అవసరమే. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ కంటే కేవలం 5 స్థానాలు మాత్రమే అధికంగా ఉండటం.. అంతగా అనుభవం లేని నాయకత్వంతో ప్రభుత్వం కొనసాగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని.. మజ్లీస్ కు చేయి అందించేందుకు రాష్ట్ర పార్టీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికైతే ఓకే కానీ.. ఓ ఏడాది తర్వాత ఎమ్మెల్యేల్లో అసంతృప్తి మొదలైనా.. లేక అధికారం కోసం బీఆర్ఎస్ ఏదైనా కుట్రలకు తెరతీసినా పరిస్థితి ఏంటనేదానిపై.. ముందస్తు ఆలోచనతోనే కాంగ్రెస్.. మజ్లీస్ తో పొత్తు రాజకీయాలకు తెరతీసిందని చెబుతున్నారు. అయినా కాంగ్రెస్, మజ్లీస్ ఒక్కతాను ముక్కలే. ఇందులో వేరే అర్థాలకు, అపార్థాలకు చోటు లేదు.