కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే

*మోదీ గ్యారంటీకి, ఇతరుల గారడీ మాటలకు మధ్య తేడా

కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒక్కటే అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి హామీలను తుంగలో తొక్కే ప్రయత్నం జరుగుతుందని ఆమె ధ్వజమెత్తారు. 
 
మూడు పార్టీలు ఒక్కటేనని స్పీకర్ ఎన్నిక స్పష్టం చేస్తోందని ఆమె విమర్శించారు. రైతుబంధును వెంటనే రైతు ఖాతాల్లో జమ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రూ.500 గ్యాస్ కోసం ఎజెన్సీల ముందుకు మహిళలు క్యూ కడుతున్నారని ఆమె చెప్పారు. బీజేపీ పోరాటం వలనే కేసీఆర్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. 
 
ఉచిత హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెబుతూ ఎవరు ఎవరితో కుమక్కు అయ్యారో తాజా పరిణామాలే ఉదాహరణ అని అరుణ చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం, సీట్లను గణనీయంగా పెంచుకుందని ఆమె గుర్తు చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ మెజారిటీ సీట్లు గెలవబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
 
మాజీ సీఎం, ప్రస్తుత సీఎంను బీజేపీ అభ్యర్థి కామారెడ్డిలో మట్టి కరింపించారని అరుణ గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీని కోరుకుంటున్నారని అసెంబ్లీ ఎన్నికలు నిరూపించాయని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక భారాన్ని సాకుగా చూపి ఎన్నికల హామీలను కాంగ్రెస్ ఎగనాం పెట్టకూడదని ఆమె హితవు పలికారు.
తెలంగాణలో లోపాయికారి ఒప్పందంతో ఉన్న పార్టీలు బిజెపి ఎదుగుదలను చూసి ఓర్వలేక బిజెపి, బీఆర్ఎస్ ఒకటేనని దుష్ప్రచారం చేశారని అరుణ విమర్శించారు.
తెలంగాణలోనూ సీట్లు, ఓట్ల శాతం పెంచి భవిష్యత్తు బీజేపీదే అని ఆమె భరోసా వ్యక్తం చేశారు.  ఇచ్చి‌న హామీలను ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాల్సిందే అని ఆమె పట్టుబట్టారు.  వరసగా మూడోసారి నరేంద్రమోదీ దేశానికి ప్రధాని కాబోతున్నారని ఆమె జోస్యం చెప్పారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 403 స్థానాలను గెలవబోతోందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
అభివృద్ధితో కూడిన జాతీయవాదానికి జనం పట్టం కడతారని మూడు రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ అఖండ విజయం, ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు స్పష్టంగా రుజువు చేసాయని అరుణ తెలిపారు. మోదీ గ్యారంటీకి, ఇతరుల గారడీ మాటలకు మధ్య ఉన్న తేడా ప్రజలకు తెలుసు కాబట్  ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బిజెపిని అఖండ మెజారిటీతో గెలిపించారని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రధాని మోదీపై, ఆయన పాలనపై చాలామంది చిల్లర మాటలు మాట్లాడారని, దేశం కీర్తిని దిగజార్చేలా మాట్లాడారని చెబుతూ  వారి మాటలకు ఈ ఎన్నికల ఫలితాలు చెంపదెబ్బ లాంటిదని ఆమె ధ్వజమెత్తారు. తమ భవిష్యత్తును భద్రంగా చూసుకునే పార్టీ ఏదో ప్రజలు మరోసారి కుండబద్దలు కొట్టినట్లు ఆమె తెలిపారు. అందుకే మూడు రాష్ట్రాలలో డబుల్ ఇంజిన్ సర్కార్ ను మంచి మెజారిటీతో గెలిపించారని స్పష్టం చేశారు.

 
రాహుల్ గాంధీ సన్మిహిత ఎంపీ సాహూ ఇంట్లో వందల‌ కోట్లు దొరకటం సిగ్గుచేటని ఆమె ధ్వజమెత్తారు. అవినీతి సామ్రాట్‌లు నరేంద్రమోదీని గద్దె దించాలని చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావని ఆమె స్పష్టం చేశారు. మోదీ హయాంలో అభివృద్ధిలో భారతదేశం దేశం దూసుకుపోతోందని డీకే అరుణ పేర్కొన్నారు.