దర్శన ఏర్పాట్లలో ప్రభుత్వాల వైఫల్యం.. హిందూ భక్తులకు తప్పని అగచాట్లు

హిందువులు మెజార్టీగా ఉన్న ఈ దేశంలో.. వారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలిపే ఘటనలు.. వరుసగా చోటు చేసుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో రెండు ప్రముఖ క్షేత్రాల్లో భక్తులు తీవ్ర ఆందోళనకు అంతకుమించిన ఆవేదనకు గురయ్యారు. తమిళనాడు శ్రీరంగంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో అలాగే.. కేరళలోని శబరిమల ఆలయంలో భక్తులకు కనీసం దర్శనం కూడా దక్కని పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో భక్తుల వేదన.. అరణ్య రోదనే అయ్యింది. సెక్యులర్ ప్రభుత్వాలు ఏలుతున్న ఈ రాష్ట్రాల్లో హిందూభక్తుల దాడులే కాదు.. పవిత్రక్షేత్రాలపై తీవ్ర నిర్లక్ష్యం.. కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.
మంగళవారం (డిసెంబర్-12) తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీరంగనాథస్వామి ఆలయం.. భక్తుల రక్తంతో అపవిత్రమైంది. ఆంధ్ర, కర్ణాటకకు చెందిన అయ్యప్ప భక్తులు శబరిమలకు వెళ్లి మాలవిరమణ చేశాక.. తిరుగు ప్రయాణంలో శ్రీరంగానికి చేరుకున్నారు. స్వామివారి దర్శనం కోసం పెద్దసంఖ్యలో భక్తులు.. ఒకే సమయంలో రావడంతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి. దీంతో దర్శనానికి ఎక్కువ సమయం పట్టేలా ఉండటంతో.. ఆంధ్రకు చెందిన భక్తులు గోవింద నామాలు స్మరించడం ప్రారంభించారు. కానీ ఈ స్మరణకీర్తలను నచ్చని అక్కడి సిబ్బంది వారిపై ఏకంగా దాడికి దిగారు. ఈ క్రమంలో ఆలయ గర్భగుడి ఆవరణలోనే ఓ ఆంధ్రా భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ముఖం నుంచి రక్తం చిందింది. పవిత్ర క్షేత్రంలో రక్తపు మరకలు హిందువులు, హిందూ ఆలయాలపై అక్కడి ప్రభుత్వ నిర్లక్ష్యానికి మచ్చుతునకలుగా మారాయి.
ఇటు ఆలయ సిబ్బంది దాడులపై అయ్యప్పభక్తులు ఆందోళన చేపట్టారు. మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆలయంలోకి చేరుకుని ఆందోళన చేస్తున్న సిబ్బందిని బలవంతంగా తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు వ్యతిరేకంగా ఆలయం గర్భగుడి ఎదురుగా నినాదాలు చేశారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాస్తవానికి తమిళనాడు దేవాదాయ ధర్మాదాయ శాఖ హెచ్ఆర్ అండ్ సీఈ (HR & CE) సిబ్బందే ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ సిబ్బందిని దేవాదాయశాఖ నియమిస్తోంది. ప్రభుత్వ జోక్యంతోనే అక్కడ నియామకాలు జరుగుతాయి. దీంతో ఆయా ఉద్యోగాల్లో హిందూధర్మంపై విశ్వాసం లేనివారే అధికంగా ఉంటూ వస్తున్నారు. దీంతో హిందూ భక్తుల పరిస్థితి ఇలా అఘోరించింది.
ఇక శబరిమల ఆలయంలో.. బుధవారం (డిసెంబర్-13) లక్షలాదిగా భక్తులు సన్నిధానం చేరుకున్నారు. అయ్యప్ప దర్శనం కోసం పదునెట్టంబాడీ దగ్గర ఇసుకేస్తే రాలనంతగా భక్తకోటి తరలివచ్చింది. ఎక్కడ చూసినా ఇరుముడులు కట్టుకుని దర్శనం కోసం పోటీ పడుతున్న భక్తులే కనిపించారు. దీంతో దర్శనం కోసం పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. గంటల తరబడి క్యూ లైన్లలోనే నిరీక్షించారు. అయితే ఆలయం దగ్గర ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. క్రౌడ్ మేనేజ్ మెంట్ చర్యలేవీ కనిపించలేదు. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు దర్శనం చేసుకోకముందే.. వెనుదిరిగిన పరిస్థితి నెలకొంది. మండల దీక్షలు ముగింపు సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిసినా.. ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. దర్శనం లేకుండానే వెళ్లిపోతున్నట్లు పలువురు కన్నీటిపర్యంతమయ్యారు. ఇటు దర్శనం కోసం నిలబడ్డ 11 ఏళ్ల బాలిక.. ఒక్కసారిగా కుప్పకూలిపోయి.. ప్రాణాలు కోల్పోయింది.
ఇక్కడ కూడా పలువురు భక్తులు కేరళ సీఎం పినరయి విజయన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలాగే ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డ్, కేరళ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరైతే ఏకంగా బారికేడ్లను దూకి పవిత్ర మెట్ల మార్గం దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారింది. అయితే కేరళలోని సీఎంతో పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా రాష్ట్రవ్యాప్త బస్సు యాత్ర చేపట్టారు. వీరి కోసమే పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడంతో.. శబరిమల దగ్గర అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం.. కొత్తవారితో క్రౌడ్ మేనేజ్ మెంట్ చర్యలు చేపట్టడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది. తాగునీరు, టాయ్ లెట్ల వంటి కనీస వసతులు కూడా లేకపోవడంతో.. భక్తులంతా తీవ్ర ఆగ్రహావేశాలతో వెనుదిరిగారు.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రకరకాల వాదనలు వినిపిస్తూ తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేరళలో రెండో మెజార్టీ వర్గమైన ముస్లీంలకు హజ్ యాత్రను చాలా పకడ్బందీగా, సకల ఏర్పాట్లు చేసి పంపిస్తున్నారు కానీ.. లక్షలాదిగా తరలివచ్చే అయ్యప్ప భక్తులను అస్సలు పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తున్నారు. సెక్యులర్ రాష్ట్రాలుగా పేరుగాంచిన కేరళ, తమిళనాడుల్లో హిందువులు రెండో తరగతి ప్రజలుగా బతుకుతున్నారన్నదానికి ఇవే ఉదాహరణలు అంటూ చెబుతున్నారు. తమిళనాడులో ఆలయాల్లో ఏకంగా అర్చకులను ప్రభుత్వమే రిక్రూట్ చేస్తోంది. కొందరు మహిళలను కూడా అర్చకవృత్తిలోకి తీసుకురావడాన్ని గమనిస్తే.. ఆలయాలపై ప్రభుత్వం గుత్తాధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. పేరుకు లౌకిక ప్రభుత్వాలు కానీ.. వారి చర్యలన్నీ హిందూ వ్యతిరేకమే అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా ఆలయాలు ప్రభుత్వ ఆధిపత్యం నుంచి స్వాతంత్య్రం తీసుకురావాలని.. హిందూధర్మాన్ని కాపాడాలని హైందవ సంఘాలు, ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు.