పార్లమెంట్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి అలజడి సృష్టించిన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద చోటుచేసుకున్న భద్రతా వైఫల్యాలు కొత్త పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. గతంతో పోలిస్తే పార్లమెంట్ వద్ద భద్రతా వ్యవస్థ మరింత మరింత పటిష్టం చేసినప్పటికీ స్మోక్ బాంబులతో ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీలోకి ఎలా ప్రవేశించగలిగారన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.
కాగా, ఈ దాడిలో నలుగురు పాల్గొన్నట్టు తొలుత పోలీసులు వెల్లడించారు. కానీ, ఇందులో మొత్తం ఆరుగురు పాల్గొన్నట్టు పోలీస్ వర్గాలు పేర్కొన్నాయి. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీలో కూర్చున్న యువకులు సాగర్ శర్మ, మనో రంజన్‌లు ఛాంబర్‌లోకి దూకి కలర్ స్మోక్ స్ప్రే చేశారు.
ఇదే సమయంలో పార్లమెంట్ బయట ఉన్న అమోల్ షిండే, నీలం దేవి కౌల్‌లు ఎరుపు, పసుపు రంగు క్యానన్లు స్ప్రే చేసి, రాజ్యాంగాన్ని రక్షించాలి, భారత్ మాతాకీ జై అంటూ పెద్దగా నినాదాలు చేస్తూ పరుగెత్తారు. పార్లమెంట్ వెలుపల కలర్ స్మోక్‌ను వదిలిన వారిని నీలం ఆజాద్ (42), అమోల్ షిండే(25) గా గుర్తించారు.
వీరితో పాటు గురుగ్రామ్‌కు చెందిన లలిత్ ఝా, విక్కీ శర్మలు కూడా పాల్గొన్నట్టు పోలీసులు చెప్పారు. లలిత్ ఝా ఇంటిలోనే వీరంతా బస చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటి వరకూ ఐదుగుర్ని అరెస్ట్ చేశామని, మరొకరి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు.
ఏడాది క్రితమే మైసూర్ లో సమావేశమైన బృందం
అయితే, ఈ ఆరుగురు పైకి కనిపించేవారు గాని అసలు కుట్రదారులు వేరేవారున్నారని, వారు కొంతకాలంగా రేకి నిర్వహిస్తున్నారని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. వీరంతా `భగత్ సింగ్ ఫ్యాన్ క్లబ్’ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకొని సమాచారం పంపుకొంటున్నట్లు కనుగొన్నారు. సాగర్ శర్మ స్వస్థలం యూపీలోని లక్నో కాగా మనో రంజన్, అమోల్ షిండే మహారాష్ట్రలోని లాతూర్, నీలం హరియాణాలోని హిస్సార్‌కు చెందినవారిగా గుర్తించారు. వీరికి ఆన్‌లైన్‌లోనే పరిచయం ఏర్పడిందని తెలిసింది. వీరంతా ఒక ఏడాది క్రితమే మైసూర్ లో సమావేశమైన్నట్లు కనుగొన్నారు.
సాగర్ గత జూన్ లోనే ఢిల్లీకి వచ్చినా పార్లమెంట్ లో ప్రవేశింపలేక పోయారు. వీరంతా డిసెంబర్ 10న ఎవరికి వారుగా ఢిల్లీకి చేరుకున్నారు. వారి ఢిల్లీ గెట్ వద్ద కలుసుకోగా, అక్కడనే రంగుల క్రాకర్స్ ను పంపిణి చేశారు. లోక్‌సభ విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి ఆందోళన చేసిన వారిని సాగర్ శర్మ, డీ మనోరంజన్(35)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ కూడా కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన వారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
పార్లమెంట్ సచివాలయం నుండి వచ్చిన కోర్కె మేరకు కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ ఈ ఘటనపై సి ఆర్ పి ఎఫ్ డైరెక్టర్ జనరల్ అనీష్ దయాల్ సింగ్ నేతృత్వంలో ఒక అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
2001లో పార్లమెంట్‌పై దాడి జరిగిన తర్వాత పాత పార్లమెంట్ భవనం వద్ద భధ్రతను ప్రక్షాళన చేశారు. మూడంచెల భద్రతా వ్యవస్థ స్థానంలో నాలుగు అంచెల భద్రతా వ్యవస్థ అమలులోకి వచ్చింది. పార్లమెంట్ వద్ద ఢిల్లీ పోలీసుకు చెందిన ప్రత్యేక విభాగంతోపాటు సిఆర్‌పిఎఫ్‌కు చెందిన ఒక కంటింజెంట్‌ను ఏర్పాటు చేశారు.
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరీ ఫోర్స్, అగ్నిమాపక దళంతోసహా ఇతర సంస్థలను భద్రతా వ్యవస్థలో మమేకం చేశారు. భద్రతా ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ వద్ద సందర్శకులను క్షుణ్ణంగా తనిఖీలు చేయడం జరుగుతుంది. భౌతిక తనిఖీలతో పాటు సందర్శకుల వద్ద ఉండే వస్తువులన్నిటినీ క్షుణ్ణంగా తనిఖీ జరుగుతుంది.
ఫోన్లు, బ్యాగులు, నీళ్ల బాటిళ్లతోపాటు చిల్లర నాణేలను సైతం లోపలకు అనుమతించరు. సందర్శకులు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డులను చూపించాల్సి ఉంటుంది. మూడు ఫుల్ బాడీ స్కానర్లను దాడుటకునే లోపలకు ప్రవేశం ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాతే సందర్శకులకు పాసులు జారీ చేస్తారు.
సందర్శకుడి నేపథ్యాన్ని గురించి ఆరా తీసిన తర్వాత పాసుల జారీ జరుగుతుంది. పార్లమెంట్ సభ్యుడు సంతకం చేసిన సిఫార్సు లేఖలపైనే పాసులు జారీ చేస్తారు. పార్లమెంట్‌లోని విజిటర్స్ గ్యాలరీలోకి ప్రవేశించిన ఆ ఇద్దరు వ్యక్తులు స్మోక్ బాంబులను తమ షూ లోపల దాచి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారిని తనిఖీ చేస్తున్న సమయంలో షూల విషయాన్ని భద్రతా సిబ్బంది విస్మరించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ఫుల్ బాడీ స్కానర్లను వారిద్దరూ ఎలా తప్పించుకుని ఉంటారన్నది మాత్రం అంతుచిక్కడం లేదు.
More Stories
రాహుల్ అజ్ఞానం వెల్లడిస్తున్న మోహన్ భగవత్‌పై వ్యాఖ్యలు
వాయుసేన అమ్ములపొదిలోకి మరో మూడు యుద్ధ నౌకలు
బంగ్లాదేశ్ లో కంగనా ‘ఎమర్జెన్సీ’ పై నిషేధం