టీటీడీ నిధుల మళ్లింపుపై హైకోర్టు అభ్యంతరం

ఏపీ హైకోర్టు తిరుమల తిరుమతి దేవస్థానానికి షాక్‌ ఇచ్చింది. ఆలయానికి వస్తున్న నిధుల నుంచి తిరుపతి మున్సిపల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడాన్ని తప్పుపట్టింది.  తిరుపతి పరిశుభ్రత, తిరుపతి రహదారుల నిర్వహణ కోసం కార్పొరేషన్ నాలుగు టెండర్లు పిలిచింది. 
 
దీన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత భాను ప్రకాష్‌ రెడ్డి ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. బుధవారం హైకోర్టులో పిల్ విచారణకు రాగా పిటిషనర్ వాదనలు వినిపిస్తూ టీటీడీ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం ప్రకారం విరుద్ధమని తెలిపారు. గతంలో ఎప్పుడూ ఇలా టీటీడీ నిధులు మళ్లించలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ నిధులు భక్తుల సౌకర్యాలు, తిరుమల అభివృద్ధి కోసమే వినియోగించాలని కోరారు.
 హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పారిశుద్ధ్యం పనులకు టీటీడీ నిధులు మళ్లించొద్దని ఆదేశించింది. అదే విధంగా కాంట్రాక్టర్లకు సొమ్ము విడుదల చేయొద్దని తెలిపింది. కానీ టెండర్‌ ప్రక్రియ కొనసాగించుకోవచ్చని టీటీడీకి స్పష్టం చేసింది.  ఆలయ నిధులు మళ్లించడం దేవాదాయ చట్టం సెక్షన్‌ 111కు విరుద్ధమని తెలిపింది. 

ఈ కేసులో రెండు వారాల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని టీటీడీ, తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. టీటీడీ బడ్జెట్‌ నుంచి తిరుపతి అభివృద్ధికి ఏటా ఒక్క శాతం నిధులు ఖర్చు చేసేందుకు ఇటీవల టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. దీనిపై పెద్ద దుమారం రేగింది. దీంతో ఈ తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది.

తిరుపతి కార్పొరేషన్‌లోని రోడ్లు, కాలనీలలో పారిశుద్ధ్యం పనులకు టీటీడీ నిధులు వినియోగించాలని పాలక మండలి నిర్ణయించింది. ఇందుకు గాను ఏటా రూ.100 కోట్లు ఖర్చు చేసేందుకు టీటీడీ ఈవో ఆమోదం తెలిపారు. ఈ పనుల నిర్వహణకు నవంబర్ 22న టెండర్లు ఆహ్వానించారు.  టెండర్లు స్వీకరించేందుకు డిసెంబరు 7ను చివరి తేదీగా నోటిఫికేషన్ లో తెలిపారు.

డిసెంబర్ 16న జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో బిడ్లు ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రక్రియను నిలిపివేయాలని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఇదే తరహాలో తిరుపతిలో రహదారి సుందరీకరణకు టీటీడీ రూ.10 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు అవ్వడంతో టీటీడీ అప్పుడు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.