ఏపీ నీళ్ళే అడగలేదని కేంద్రానికి కృష్ణా బోర్డు ఫిర్యాదు

కృష్ణా జలాల విడుదల కోసం ఆంధ్రప్రదేశ్‌ తమను సంప్రదించనేలేదని కేంద్ర హోం శాఖకు కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) ఫిర్యాదు చేసింది. కనీసం ఇండెంట్‌ కూడా పెట్టలేది ఆక్షేపించింది. గత నెల 29వ తేదీ అర్ధరాత్రి (మరికొన్ని గంటల్లో తెలంగాణలో పోలింగ్‌ జరుగుతుందనగా) నాగార్జున సాగర్‌ డ్యాంను స్వాధీనం చేసుకోవడంపై తమకు ముందస్తు సమాచారం లేదని తెలిపించి. 

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలూ కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను తమకు స్వాధీనం చేయలేదని స్పష్టం చేసింది. గత నెల 29వ తేదీన అర్ధరాత్రి దాటాక ఆంధ్రప్రదేశ్‌ పోలీసు నాగార్జున సాగర్‌ను స్వాధీనం చేసుకుని 13వ నంబరు క్రస్ట్‌ గేటు వరకు కంచె వేసిన సంగతి తెలిసిందే.  దీనివల్ల మళ్లీ తెలంగాణ సెంటిమెంటు రగిలి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఎన్నికల లబ్ధి చేకూరుతుందన్న ఎత్తుగడతోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ చర్యకు ఉపక్రమించారని విపక్షాలు మండిపడ్డాయి.

కేఆర్‌ఎంబీకి ఇండెంట్‌ పెట్టకుండా.. ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా.. అర్ధరాత్రి డ్యాంను ఆక్రమించి నీటిని విడుదల చేయడం వెనుక రాజకీయ కుట్ర దాగుందని ఆరోపించాయి.  దీనిని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నెల ఒకటో తేదీన కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ భల్లా ఆంధ్రప్రదేశ్‌ సీఎస్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, తెలంగాణ సీఎస్‌ శాంతి కుమారి, ఇరు రాష్ట్రాల డీజీపీలు, జల వనరుల శాఖ ముఖ్యకార్యదర్శులు తదితరులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమావేశం మినిట్స్‌ను కేంద్రం మంగళవారం విడుదల చేసింది.

తమకు కేటాయించిన కృష్ణా జలాలను వాడుకునేందుకు తమ భూభాగంలోని సాగర్‌ను స్వాధీనం చేసుకున్నామని జవహరరెడ్డి చెప్పారు. తెలంగాణ సీఎస్‌ మాత్రం ఏపీ సాయుధ బలగాలు విధ్వంసం చేశాయని, భయోత్పాతాన్ని సృష్టించాయని, అర్ధరాత్రి దౌర్జన్యంగా సాగర్‌ను ఆక్రమించి డ్యాం గేట్లు ఎత్తి నీళ్లను విడుదల చేశాయని కేంద్రానికి ఫిర్యాదు చేశారు. 

కృష్ణా బోర్డు, రెండు రాష్ట్రాల వాదనలు విన్న భల్లా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టులను కృష్ణా నదీ యాజమాన్య సంస్థకు అప్పగించాలని ఆదేశించారు. సాగర్‌, శ్రీశైలం జలాశయాల వద్ద కేంద్ర సాయుధ బలగాల పహరా ఉంటుందని, ఏపీ పోలీసులను వెనక్కి పిలవాలని స్పష్టం చేశారు.