అక్రమ వలసదారుల డేటా సేకరించడం అసాధ్యం

దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్‌ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతుంది. కేసు విచారణ సందర్భంగా కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది.  ఈ సెక్షన్‌ పౌరసత్వ చట్టంలోని అసోంకు చెందింది.
అయితే, చట్టం ప్రకారం.. 17,861 మందికి పౌరసత్వం ఇచ్చినట్లు కేంద్రం కోర్టుకు తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు 1966-1971 మధ్య కాలంలో 32,381 మంది విదేశీయులుగా గుర్తించినట్లు పేర్కొంది.  అసోంలో 1966 జనవరి 1 నుంచి 1971 మార్చి 25 వరకు ఎంతమంది బంగ్లాదేశ్ పౌరులకు భారత పౌరసత్వం ఇచ్చారని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ‘సుప్రీం’ ప్రశ్నించడంతో పాటు డేటాను కోరింది. అలాగే అక్రమ చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నది. 

దీనిపై కేంద్రం స్పందిస్తూ ఎలాంటి ఎలాంటి పత్రాలు లేకుండా రహస్యంగా దేశంలోకి వలసదారులు అక్రమంగా ప్రవేశిస్తున్నారని పేర్కొంది. అక్రమ వలసదారులను గుర్తించడం, వారిని నిర్బంధించడం, తిరిగి వారి దేశాలకు పంపించడం సంక్లిష్టమైన ప్రక్రియ అని పేర్కొంది. అలాంటి పరిస్థితిలో దేశంలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న అక్రమ వలసదారుల గురించి డేటాను సేకరించడం సాధ్యం కాదని తెలిపింది.

2017 నుంచి 2022 మధ్య కాలంలో 14,346 మంది విదేశీయులను తిరిగి వారి దేశాలకు పంపినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం, అసోంలో వంద ఫారినర్స్ ట్రిబ్యునల్స్‌ పని చేస్తున్నాయని, 31 అక్టోబర్ 2023 వరకు 3.34 లక్షల కేసులు పరిష్కారమయ్యాయని తెలిపింది. ఫారినర్స్ ట్రిబ్యునల్ ఆదేశాలకు సంబంధించిన 8,461 కేసులు గౌహతి హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంది. 

ఈ సందర్భంగా అసోంలో చొరబాట్లను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు ఫెన్సింగ్‌ వేస్తున్నట్లు వివరించింది.